Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్
న్యూఢిల్లీ : దేశంలోని బడా కార్పొరేట్లకు గత ఐదేండ్లలో రూ.10,09,510 కోట్లను కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం గత ఐదేండ్లలో బ్యాంకులు రూ.10,09,510 కోట్లు రుణమాఫీ చేశాయని తెలిపారు.
సంవత్సరం రుణమాఫీ (కోట్లలో)
2017-18 రూ. 1,61,328
2018-19 రూ. 2,36,265
2019-20 రూ. 2,34,170
2020-21 రూ. 2,02,781
2021-22 రూ. 1,74,966
మొత్తం రూ.10,09,510
ఆరేండ్లలో ప్రయివేట్ కంపెనీలకు 11,778 ఎకరాలు
దేశంలోని ప్రయివేట్ కంపెనీలకు గత ఆరేండ్లలో 11,779. 42 ఎకరాలు ఇచ్చినట్టు కేంద్ర పోర్ట్స, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో పోర్టుల కోసం ప్రయివేట్ కంపెనీలకు 11,779.42 ఎకరాలు లీజుకిచ్చామని పేర్కొన్నారు.
ఏడాది ఇచ్చిన ఎకరాలు
2016 299.63
2017 6803.84
2018 269.36
2019 3967.68
2020 115.91
2021 322
మొత్తం 11,779. 42
ఆరోగ్య రంగలో 75,413 పోస్టులు ఖాళీ
అందులో 18,967 డాక్టర్ పోస్టులు
పారామెడికల్ స్టాప్ 25,424 ఖాళీ
ల్యాబ్ టెక్నిషన్లు 10,632
దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య రంగంలో 75,413 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి భారతి ప్రవీన్ పవర్ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2021 మార్చి నాటికి జిల్లా ఆసుపత్రుల్లో 75,413 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. డాక్టర్ పోస్టులు జిల్లా ఆసుపత్రుల్లో 5,777, సబ్ డివిజనల్ ఆసుపత్రుల్లో 4,763, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ)ల్లో 8,427 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్సి)లో 9,268 స్పెషలిస్టల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా ఆస్పత్రుల్లో 23,537, సబ్ డివిజనల్ ఆస్పత్రుల్లో 1,887 పారామెడికల్ స్టాప్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 9,564 ఫార్మసిస్టులు, 10,632 ల్యాబ్ టెక్నిషన్లు, సీహెచ్‌సీల్లో 1,558 రేడియోగ్రాఫర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
విభాగం ఖాళీలు
డాక్టర్లు 18,967
స్పెషలిస్టులు 9,268
పారామెడికల్ స్టాప్ 25,424
ఫార్మసిస్టులు 9,564
ల్యాబ్ టెక్నిషన్లు 10,632
రేడియోగ్రాఫర్లు 1,558
కేంద్ర వైద్య విద్యా సంస్థల్లో 35,561 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ
కేంద్ర వైద్య విద్యా సంస్థల్లో 35,561 షార్ట్‌ఫాల్, బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రి భారతి ప్రవీణ్ పవర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ దివకొండ దామోదర్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 అక్టోబర్ 18 వరకు 35,561 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అత్యధికంగా నూతన ఎయిమ్స్‌ల్లో 21,459 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. నాబార్డ్‌లో 1,013 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజరు సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి భగవత్ కరాద్ తెలిపారు.
పది ప్రభుత్వ రంగ సంస్థల్లో
పెట్టుబడులు ఉపసంహరణ
ఐదు సంస్థలను మూసివేస్తాం..కేంద్రం
పది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవడం పూర్తి అయిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ తెలిపారు. సిపిఐ ఎంపి పి.సంతోష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని, 33 సంస్థలను డీఐపీఎఎం చూస్తోందని, మూడు సంస్థలను సంబంధిత మంత్రిత్వ శాఖలు చూస్తాయని తెలిపారు. అందులో పది సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి అయిందని, ఐదు సంస్థలను మూసివేసే అంశాన్ని పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. మిగతా సంస్థలు వివిధ స్థాయిల్లో ఉన్నాయని అన్నారు.
లాభాల్లోనే వైజాగ్ స్టీల్‌ప్లాంట్
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ లాభాల్లోనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో మొత్తం 188 ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో ఉన్నాయని, ఒక సంస్థ (ఎఫ్‌సీఐ) లాభాలు, నష్టాలు లేవని తెలిపారు. 59 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని జాబితాను విడుదల చేసింది. లాభాల్లో ఉన్న 188 ప్రభుత్వ రంగ సంస్థల్లో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్ (వైజాగ్ స్టీల్‌ప్లాంట్)ను పేర్కొంది.
ప్రభుత్వ ప్రకటనల కోసం రూ.6,491 కోట్లు ఖర్చు
దుబారా ఖర్చులు తగ్గించుకోవాలంటూ... సంక్షేమపథకాలకు కేంద్రం కోతపెడుతోంది.
కానీ మరోవైపు ప్రభుత్వ ప్రకటనల కోసం మోడీ ప్రభుత్వ హయంలో రూ.6,491.56 కోట్లు ఖర్చు చేశామని సమాచార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. సీపీఐ లోక్‌సభ ఎంపీ ఎం.సెల్వరాజ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014-15 నుంచి 2022-23 (డిసెంబర్ 7) వరకు ప్రింట్ మీడియాకు రూ.3,230.77 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాకు రూ.3,260.79 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేశామని తెలిపారు.