Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ల్యాప్‌టాప్‌లో ఆ మేరకు పత్రాలను చొప్పించారు
- వెల్లడించిన అమెరికన్ ఫోరెన్సిక్ సంస్థ నివేదిక
న్యూఢిల్లీ : బీమా కొరెగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామిని ఇరికించేందుకు ఆయన కంప్యూటర్లో అనేక నేరారోపణ పత్రాలను చొప్పించారని అమెరికన్ ఫోరెన్సిక్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. తీవ్రవాదులతో సంబం ధాలున్నాయంటూ 2020లో 83ఏళ్ళ స్టాన్ స్వామిని అరెస్టు చేశారు. ఏడాది తర్వాత కస్టడీలోనే ఆయన మరణించారు. కాగా, స్టాన్ స్వామిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) నమోదు చేసిన అభియోగాల్లో చాలా అవకతవకలు వున్నాయని నివేదిక పేర్కొంది. నక్సల్ కుట్రలో స్టాన్ స్వామి భాగస్వామి అని పేర్కొంటూ మావోయిస్టు నేతలతో ఫాదర్‌కి సంబంధాలు వున్నాయని ఆనాడు కేంద్రం ఆరోపించింది. బోస్టన్ కేంద్రంగా పనిచేసే ఫోరెన్సిక్ సంస్థ ఆర్సెనల్ కన్సల్టింగ్ నుండి తమకు అవసరమైన సేవలను అందుకునేందుకు గానూ స్వామి తరపు న్యాయవాదులు ఆ సంస్థను నియమించుకున్నారు. గుర్తు తెలియని సైబర్ అటాకర్ దాదాపు 44 పత్రాలను స్వామి కంప్యూటర్లోకి ఎక్కించాడని ఆ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో మావోయిస్టు లేఖలుగా పేర్కొంటున్నవి కూడా వున్నాయి. ఐదేళ్ళ కాలంలో అంటే 2014 నుండి 2019 వరకు ఈ పత్రాలను స్వామి కంప్యూటర్లోకి చొప్పించారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ కార్యకలాపాల్లో తమకు చాలా విస్తృతమైన అనుభవం వుందని ఆర్సెనల్ కన్సల్టింగ్ చెప్పింది. బోస్టన్ మారథాన్ బాంబింగ్ కేసుతో సహా పలు ఉన్నత స్థాయి కేసుల్లో దర్యాప్తు చేశామని తెలిపింది. జార్ఖండ్‌కి చెందిన జీసస్ ప్రీస్ట్ స్వామి గిరిజనుల్లో పనిచేసేవారు. బీమా కొరెగావ్ కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టును ఖండిస్తూ సర్వత్రా ఖండనలు వెల్లువెతాయి. జైల్లో వున్న ఏడాది కాలంలోనే కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆయన మరణించడంతో విమర్శలు మరింత ఉధృతమయ్యాయి. ఐక్యరాజ్య సమితి, యురోపి యన్ యూనియన్లు ఆయన మృతి పట్ల తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ, ఖండించాయి. తీవ్రవాదానికి పాల్పడ్డారన్న తప్పుడు ఆరోపణలతో ఆయన్ని ఖైదు చేశారని ఐక్యరాజ్య సమితి అధికారి ఆనాడు తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. అయితే 2018లో బీమా కొరెగావ్ గ్రామంలో అల్లర్లు చెలరేగేలా రెచ్చగొట్టేందుకు మరో 15మందితో కలిసి కుట్ర పన్నిన వారిలో స్వామి కూడా భాగస్వాముడని ఎన్ఐఎ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చేందుకు మావోయిస్టు లతో కలిసి స్వామి కుట్ర పన్నారంటూ ఎన్ఐఎ ఆ 15మంది కంప్యూటర్ల నుండి లభించిన పత్రాల ఆధారంగా అభియోగాలు నమోదు చేసింది.