Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్మాసనం నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో కేసు విచారణ చేయనున్న ధర్మాసనం నుంచి ఓ న్యాయమూర్తి వైదొలిగారు. కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బేలా ఎం.త్రివేదీ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ అజరు రస్తోగి తెలియజేశారు. అయితే జస్టిస్ బేలా ఎం.త్రివేది వైదొలగడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో మంగళవారం జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో దోషుల విడుదలకు మోడీ సర్కార్ ఆమోదం తెలపటం వివాదాస్పదమైంది. తాజాగా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ముంగిటకురాగా మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో దోషులుగా ఉన్న 11మంది ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతోపాటు రాజకీయ పార్టీలు కూడా దీనిని ఖండించాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఆ ఉత్తర్వులను పున:సమీక్షించాలని కోరుతూ బిల్కిస్ బానో సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ మహిళా హక్కుల కార్యకర్తలు కూడా పిటిషన్ వేశారు. దోషులకు క్షమాభిక్ష మంజూరు వెనుక ఉన్న నిబంధనలను మాత్రమే తాము సవాల్ చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టేందుకు సుప్రీం అంగీకరించింది.