Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్ధీపన ప్యాకేజీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- రాష్ట్రాల మధ్య వివక్ష చూపకూడదు : సీపీఐ(ఎం) ఎంపీ ఎఎం ఆరీఫ్
న్యూఢిల్లీ: ఆత్మ నిర్భర్ భారత్ ఉద్దీపన ప్యాకేజీపై శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ(ఎం) లోక్‌సభ ఎంపీ ఎఎం ఆరీఫ్ డిమాండ్ చేశారు. మంగళవారం లోక్‌సభలో అదనపు గ్రాంట్ల డిమాండ్‌పై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ఫలితాలేవని ప్రశ్నించారు. సామాన్యులకు ఈ ప్యాకేజీ వల్ల చిన్న ప్రయోజనం కూడా జరగలేదనీ, సామాన్యులకు అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు. గత రెండేండ్ల నుంచి వంట గ్యాస్ సబ్సిడీ ఇవ్వటం లేదనీ, దీనివల్ల ప్రజల జేబులకు చిల్లుపడిందని విమర్శించారు. గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పెరిగిం దని దుయ్యబట్టారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆపారనీ, ఈ రెండింటిపై.. భారం పడనున్నదని పేర్కొన్నారు. దేశంలోని పేదల ప్రజలకు ఎటువంటి రుణాలు అందలేదనీ, రుణ ప్యాకేజీతో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం జరగలేదని తెలిపారు. లక్ష లాది మంది విద్యార్థులు తీసుకున్న విద్యా రుణాలకు ఏవిధమైన సహాయం అందలేదనీ, అందువల్ల చాలా మంది విద్యార్థులపై ప్రభావం చూపిందన్నారు. కోవిడ్ 19కు ప్రభావితం అయిన రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, సెల్ఫ్ ఎంప్లాయిస్‌కు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. అదే సమయంలో బడా కార్పొరేట్లకు మాత్రం రూ.10 లక్ష ల కోట్లు రుణ మాఫీ చేశారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానిది ఆత్మ నిర్భర్ భారత్ కాదనీ, అదానీ నిర్భర్ భారత్ అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే దేశ సంపదంతా ఆయనకే దోచిపెడుతున్నారని విమర్శిం చారు. దేశంలోని అన్ని మేజర్ పోర్టులు, ఎయిర్ పోర్టులు అదానీ చేతికి ఇచ్చారనీ, దేశం పేరుతో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేయడం అవమానకరమని దుయ్యబట్టారు. ప్రధాని కోసం రెండు విమానాలు కొన్నారని, జాతీయ వాదం గురించి గొప్పలు చెప్పే వీళ్లు ఎయిర్ ఇండియాను మాత్రం అమ్మేస్తారని ధ్వజ మెత్తారు. రైల్వేను కూడా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని విమర్శించారు. సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే రాయితీని కూడా రద్దు చేశారని, కోవిడ్-19 పేరుతో ప్రజలను ప్రభుత్వం లూటీ చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థుల కు ఫెలోషిప్స్లను రద్దు చేశారని, గ్రామీణ ప్రాంతా ల్లో ఉపాధి కల్పించే ఉపాధి హామీని కూడా సరైన నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేరళ ప్రభుత్వం పది కోట్ల పని దినా లు ఇవ్వాలని కోరితే, కేవలం ఆరు కోట్ల పని దినాలే ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రాలకు రావల్సిన నిధులు విడుదల చేయటం లేదని, జిఎస్టి పరిహారం కూడా సకాలం విడుదల చేయటం లేదని విమర్శించారు. ఇలా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని దుయ్యబట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీ డబుల్ ఇంజన్ అభివృద్ధి అని అంటున్నారని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. బీజేపీ, బీజేపీయేతర రాష్ట్రాల మధ్య ఎటువంటి వివక్ష చూపకుండా అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రధాని పైన ఉన్నదని పేర్కొన్నారు.
దేశాభివృద్ధిపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచార్ణం మహువా మొయిత్రా
దేశాభివృద్ధిపై మోడీ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. లోక్‌సభలో జరిగిన చర్చలో మహువా మొయిత్రా మాట్లాడుతూ అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి నాలుగు శాతం తగ్గి 26 నెలల కనిష్టానికి పడిపోయిందనీ, ఉద్యోగాలు 5.6 శాతానికి కుదించబడ్డాయని అన్నారు. ఈ ప్రభుత్వం, అధికార పార్టీ పప్పు అనే పదాన్ని సృష్టించాయని, మీరు దానిని కించపరచడానికి, తీవ్ర అసమర్థతను సూచించడానికి ఉపయోగిస్తున్నారని తెలిపారు. కానీ గణాంకాలు తమకు అసలు పప్పు ఎవరో చెబుతున్నాయని అన్నారు. ఇటీవలే అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో ఓటమి చెందారని, ''ఇప్పుడు పప్పు ఎవరు?'' ఆమె ప్రశ్నించారు. 2014 నుంచి 2022 వరకు గడిచిన తొమ్మిదేళ్లలో ఈ ప్రభుత్వం పాలనలో పౌరసత్వాన్ని మొత్తం 12.5 లక్షల మంది వదులుకున్నారని అన్నారు.