Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న కేసీఆర్
- పాల్గొననున్న అఖిలేష్, కుమార స్వామి
- పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల రైతు నేతలకు ఆహ్వానం
న్యూఢిల్లీ : నేడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. సర్దార్ పటేల్ రోడ్డులో నేడు (బుధవారం) మధ్యాహ్నం బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తొలుత జెండా ఎగుర వేసి, కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కార్యాలయ ప్రారంభానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమార స్వామి హాజరుకానున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అలాగే బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు రాకేష్ టికాయత్, గుర్నామ్ సింగ్ చారుని తదితరులు పాల్గొనున్నారు. బీజేపీ మాజీ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి కూడా పాల్గొంటారని సమాచారం.
బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం యజ్ఞయాగాది కార్యక్రమాలు జరిగాయి. బుధవారం కూడా కొనసాగుతాయి. తెలంగాణ నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చిల్లర రాజకీయాల కోసం బీఆర్ఎస్ రాలేదని, తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం, పేదల కోసం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రాజెక్ట్‌లు నిర్మించి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారనీ, తాగునీరు ఇవ్వలేకపోతున్నారని అన్నారు. దేశంలో యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. అనేక సమస్యలతో గత 50 ఏండ్ల నుంచి నలిగిపోతున్న దేశంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని పేర్కొన్నారు.