Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ మహాసభలో రాకేష్ టికాయత్ సందేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- కె వరదరాజన్ నగర్ (త్రిసూర్)
రైతుల సమస్యలపై సరికొత్త పోరాటానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కార్యాచరణ రూపొందిస్తోందని, ఢిల్లీ పోరాట స్ఫూర్తితో రైతాంగం అందుకు సమాయత్తం కావాలని ఎస్కేఎం అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఏఐకేఎస్ మహాసభ ప్రతినిధులనుద్దేశించి మంగళవారం సౌహార్ద సందేశమిచ్చారు. వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాల్లో ఎవ్వరు కలిసొచ్చినా కలుపుకుపోతామన్నారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన మహౌద్యమంలో పార్టీలు, జెండాలు పక్కన పెట్టి దేశం యావత్తూ మద్దతుగా కలిసొచ్చిందని గుర్తుచేశారు. అంతటి విశాల సంఘీభావం లభించినందునే మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకుందని చెప్పారు. మద్దతు ధరలకు చట్టబద్దత, రైతులకు పింఛన్లు, రుణాల మాఫీ, ఉద్యమంలో మరణించిన 750 మందికి పరిహారం డిమాండ్ల సాధన కోసం రెండవ దశ పోరాటానికి సమాయత్తం కావాలన్నారు. రాజకీయాలు, రంగులు, భాషలు, జెండాలు అనవసరమని, రైతు రక్షణ, మోడీ ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే ఉమ్మడి అజెండా అని, రైతులకు అదొక్కడే లక్ష్యమని అన్నారు. ఒకే వేదిక మీదికి రైతులందరూ రావాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా కదిలితే మోడీ ప్రభుత్వం తప్పకుండా దిగివస్తుందని టికాయత్ చెప్పారు. మోడీ సర్కార్ పోలీసులను ప్రయోగిస్తోందని, తమపై నిఘా పెట్టిందని, నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని, అయినా తగ్గేదే లేదని అన్నారు.
మోడీ సర్కారు మహమ్మారి
మోడీ ప్రభుత్వం ప్రజల పట్ల, రైతుల పట్ల, గ్రామీణ ప్రజల పట్ల మహమ్మారిగా మారిందని ఎఐకెఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ అన్నారు. మహాసభ విజయవంతం కావాలని సందేశమిచ్చారు. 65 శాతం జనాభా గ్రామాల్లో జీవిస్తుండగా, బీజేపీ వారి గురించి పట్టించుకోవట్లేదన్నారు. అన్ని వ్యవస్థలనూ ధ్వంసం చేస్తోందని చెప్పారు. జన్యుమార్పిడి ఆవాల సాగుకు వ్యతిరేకంగా ఉద్యమించక పోతే మరెన్నో పంటల్లో జిఎం విత్తనాలొస్తాయని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ దేశ ప్రధాని అయ్యారన్నారు. గ్రామీణ ప్రజలను పోరాటాల్లోకి తీసుకురావాలన్నారు.
కేరళ ప్రజలు బుద్ధి జీవులు
వామపక్ష ప్రభుత్వాన్ని ఎన్నుకున్న కేరళ ప్రజలు బుద్ధి జీవులని అఖిల భారత కిసాన్ మహాసభ నేత రాజారామ్ సింగ్ అన్నారు. కార్పొరేట్ల చేతుల్లో రైతులను పెట్టడానికే మోడీ ప్రభుత్వం మూడు చట్టాలను తెచ్చిందన్నారు. ఢిల్లీ ఆందోళనల్లో రైతులందరూ కదిలారన్నారు. అలాగే భవిష్యత్తు ఉద్యమాల్లోనూ భాగస్వాములవ్వాలని కోరారు.