Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్ద కాలంగా యథేచ్ఛగా సాగతున్న వైనం
- ఫలించని ఆదివాసీల పోరాటం
- సమర్ధించుకుంటున్న ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : రాజస్థాన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు కేటాయించిన బొగ్గు అక్రమంగా గత దశాబ్ద కాలంగా అదానీ గ్రూపునకు చెందిన విద్యుత్ స్టేషన్లకు తరలిపోతున్నది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన రికార్డులు మీడియా చేతికి అందాయి. ఛత్తీస్‌గఢ్‌కు ఉత్తరంగా హస్దేవ్ ఆరంద్ అటవీ ప్రాంతంలో 762 హెక్టార్లలో విస్తరించి వున్న ఓపెన్ కాస్ట్ గని నుంచి గత దశాబ్ద కాలంగా అదానీ ఎంటర్ప్రైజెస్ బొగ్గును తవ్వుకుంటోంది. ప్రభుత్వ అనుమతులన్నీ అనుకున్న విధంగా వచ్చినట్లైతే ఇదే ప్రాంతంలో మరో 2వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు విస్తరించబడతాయి. అయితే ఈ కార్యకలాపాలను అక్కడ గల ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన అదానీకి చెందిన మైనింగ్ సంస్థతో వారు ఏళ్ళ తరబడి పోరాటం చేస్తున్నారు. కొత్త గనులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వరాదంటూ గతేడాది వందలాదిమంది గ్రామస్తులు 300కిలోమీటర్లు దూరంలోని రాజధాని రాయపూర్‌కు ప్రదర్శనగా వెళ్లి విజ్ఞప్తులు అందచేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు అనుమతులను చత్తీస్ఘడ్ ప్రభుత్వం ఇటీవల నిలుపుచేసింది. ఇదిలా వుండగా, జీవ వైవిధ్యం సుసంపన్నంగా గల ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకాలకు అనుమతించడాన్ని కేంద్ర ప్రభుతం కూడా సమర్ధించుకుంటోంది. ప్రజా ప్రయోజనాలను ఇందుకు సాకుగా చూపుతోంది. రాజస్థాన్‌లోని విద్యుత్ స్టేషన్లకు బొగ్గు అవసరమని అందుకే బొగ్గు తవ్వకాలకు అనుమతినిచ్చామని చెబుతోంది. వాస్తవానికి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌కు ఈ గనులను కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వ సంస్థ వివాదాస్పద రీతిలో అదానీ ఎంటర్ ప్రైజెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పర్సా కెంటే కాలరీస్ లిమిటెడ్ అనే పేరున్న అదానీ సంస్థకు గనుల తవ్వకాలను ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చింది. ఒప్పంద నిబంధనల కింద అదానీ కంపెనీకి ఇందులో 74శాతం వాటాలు వున్నాయి. పర్సా ఈస్ట్, కాంతా బసన్ మైన్ల నుండి తిరస్కరించబడిన లేదా తక్కువ నాణ్యత కలిగిన బొగ్గును అమ్ముకునేందుకు అదానీ కంపెనీకి అధికారమివ్వబడింది. ప్రభుత్వ సంస్థల కోసం కేటాయించిన బొగ్గును అదానీ గ్రూపు తన స్వంత విద్యుత్ స్టేషన్ల అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి ఇదొక దొడ్డి దారి పద్దతి అంటూ మానవ హక్కుల కార్యకర్తలు, ఆదివాసీలు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తూనే వున్నారు.