Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాటా ప్రొటక్షన్ బిల్లులో వివాదాస్పద అంశాలు
- 'వ్యక్తిగత సమాచారం' పేరుతో నిబంధనలు : ఆర్టీఐ కార్యకర్తలు
న్యూఢిల్లీ : సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) నిర్వీర్యం చేసేందుకు 'డాటా ప్రొటక్షన్ బిల్లు'ను మోడీ సర్కార్ తెరపైకి తీసుకొచ్చిందని ఆర్టీఐ కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ఆర్టీఐ కమిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'వ్యక్తిగత సమాచార' నిబంధనల పేరుతో ఆర్టీఐ చట్టాన్ని బలహీనం చేయటమే కేంద్రం లక్ష్యమని, ఆర్టీఐ రెక్కలు విరగ్గొడుతోం దని వారు హెచ్చరిస్తున్నారు. డాటా ప్రొటక్షన్ బిల్లు పరిధిలోకి ఆయా కార్పొరేషన్లను, సంస్థల్ని, రాష్ట్ర ప్రభుత్వాల్ని కేంద్రం తీసుకొస్తోందని, అప్పుడు ఆర్టీఐ ద్వారా సమాచార సేకరణ అత్యంత సంక్లిష్టంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోసం ముసాయిదా బిల్లును కేంద్రం విడుదల చేయగా, ఈ అంశంపై ఆర్టీఐ కార్యకర్తలు, సమాచార కమిషనర్లు వర్చువుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'డాటా ప్రొటక్షన్ బిల్లు'పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బిల్లును కేంద్రం తీసుకొస్తోందని వారు విమర్శించారు. పౌరులు కోరే సమాచారాన్ని ఇవ్వకుండా నిరాకరించడానికి ప్రభుత్వ అధికారులకు 'డాటా ప్రొటక్షన్ బిల్లు' అధికారాల్ని కల్పిస్తోంది. ఆర్టీఐ చట్టాన్ని దెబ్బకొట్టేందుకు డాటా ప్రొటక్షన్ బిల్లు తీసుకొచ్చారని మధ్యప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ రాహుల్ సింగ్ అన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా చేస్తుందని హెచ్చరించారు. ఈ బిల్లు ఎంతమాత్రమూ చట్టరూపం దాల్చడానికి వీల్లేదన్నారు. ఈ బిల్లుతో ఆర్టీఐ చట్టానికి ముప్పు పొంచివుందని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శైలేష్ గాంధీ అన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం పౌరులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్నైనా కోరవచ్చు. 10రకాల సమాచారానికి ఇందుకు మినహాయింపు ఉంది. ఈ మినహాయింపును పెంచుతూ ఆర్టీఐని కుదించటమే కేంద్రం అసలు ఉద్దేశమని శైలేష్ గాంధీ అన్నారు. ఆర్టీఐ చట్టాన్ని పూర్తిగా బలహీనపరుస్తూ, డాటా ప్రొటక్షన్ బిల్లును బలోపేతం చేస్తున్నారని అన్నారు.