Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిసూర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కనీస మద్దతు ధరల (ఎంఎస్పీి)కి హామీ ఇచ్చే చట్టం అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కేరళ త్రిసూర్ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ మహాసభల్లో కనీస మద్దతు ధరల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ సాగు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటంలో కనీస మద్దతు ధరల చట్టం కీలకమైందని పేర్కొన్నారు. డిమాండ్లను నెరవేర్చడంతోపాటు రైతులకు ఎంఎస్పీపై చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించే పంటలకు లాభదాయకమైన ధరలు రావాల్సిన అవసరముందని చెప్పారు. తమ ఉత్పత్తులను రైతులు లాభసాటి ధరలకు అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. 91 శాతం వరి ఉత్పత్తిదారులు, 83 శాతం గోధుమ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ఎమ్ఎస్పీ కంటే తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రైతు పండించిన పంటల్లో సగం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని గుర్తు చేశారు. ఎరువుల సబ్సిడీ ఎత్తివేయడం, డీజిల్, పెట్రోలుపై భారీగా పన్ను విధించడం, విద్యుత్ సబ్సిడీలు తగ్గించారని తెలిపారు. బ్యాంకు రుణాల లభ్యత పూర్తిగా లేకపోవడంతో సాగు ఖర్చులు భారీగా పెరిగిపోయాయని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ సిఫారుల ప్రకారం కనీస మద్దతు ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నదని విమర్శించారు. రైతులకు సరైన ధరలు లభించకపోవడంతోపాటు ప్రజాపంపిణీ వ్యవస్థ నుంచి కేంద్రం ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ సమయంలో రైతులకు ఇచ్చిన హామీని సాధించేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని తీర్మానంలో జూలకంటి కోరారు.