Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర సాయుధ రక్షణ బలగాల్లో (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్-సీఏపీఎఫ్) మహిళల ప్రాతినిథ్యం నామమాత్రంగా ఉందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, అసోం రైఫిల్స్, సీఐఎస్ఎఫ్..మొదలైన సాయుధ రక్షణ విభాగాల్లో కేవలం 3.68శాతం మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి ప్రాతినిథ్యం పెరిగేలా కేంద్ర హోంశాఖ మరిన్ని చర్యలు చేపట్టాలని బీజేపీ రాజ్యసభ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ నివేదిక పేర్కొంది. మహిళా నియామకాల్ని పెంచేందుకు కేంద్ర హోంశాఖ ఎన్నో ప్రయత్నాలు చేసిందని, అయినా వారి ప్రాతినిథ్యం 3.68శాతానికి పరిమితమవటాన్ని కమిటీ తప్పుబట్టింది. ఈ నివేదికను కమిటీ రాజ్యసభ ముందుంచింది.
సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్లో మహిళా సిబ్బంది వారి స్వస్థలాలకు సమీపంలో ఉంచడం, రక్షణ బలగాల్లో చేరడానికి ప్రోత్సాహకంగా ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. రక్షణ బలగాల సిబ్బంది సెలవులను పెంచడంపై కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోందని, ఈ అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని చెప్పింది. మహిళ ప్రాతినిథ్యం ఎందుకు ఇంత తక్కువుందన్న దానిపై కేంద్ర హోంశాఖ దృష్టిసారించాలని, అడ్డంకులను తొలగించాలని పేర్కొంది. ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనాలని సిఫారసు చేసింది.
'' కేంద్ర సాయుధ రక్షణ బలగాల్లో చేపట్టే కానిస్టేబుల్ నియామకాల్లో 33శాతం మహిళా రిజర్వేషన్లను అమలుజేయాలని 2016లోనే కేంద్రం నిర్ణయించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ విభాగాల్లో 33శాతం, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీలలో 14 నుంచి 15శాతం పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించింది. అయితే ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీనిని సరిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ నిర్మాణాత్మక చర్యలు చేపట్టాల్సి ఉంది'' అని నివేదిక తెలిపింది. సాయుధ బలగాల్లో చేరేలా మహిళా అభ్యర్థుల్ని ప్రోత్సహించాలని సూచించింది.