Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
- స్టాన్ స్వామి కేసులో హేయమైన రీతిలో వ్యవహరించారని విమర్శ
న్యూఢిల్లీ : బీమా కొరెగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామిని అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నాలు జరిగాయంటూ తాజాగా అమెరికా ఫోరెన్సిక్ కంపెనీ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో తక్షణమే ఈ కేసులోని నిందితులందరినీ విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది.
బీమా కొరెగావ్ కేసులో ఫాదర్ స్టాన్ స్వామిని జాతి వ్యతిరేకిగా చూపించడానికి ఆయన కంప్యూటర్ను హ్యాక్ చేసి నకిలీ పత్రాలు చొప్పించి వాటిని సాక్ష్యాధారాలుగా చూపించారంటూ ఆర్సెనల్ కన్సల్టింగ్ కంపెనీ విడుదల చేసిన కొత్త నివేదిక పేర్కొంది. 2017 నుండి 2019 మధ్య కాలంలో ఇదంతా జరిగింది. ఈ నాలుగేండ్ల కాలంలో మొత్తంగా 40 ఫైళ్ళను ఆయన కంప్యూటర్లో ప్రవేశపెట్టారు. కానీ వాటిని ఆయన ఎన్నడూ చూడనైనా లేదని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంటోంది. కాగా, ఫాదర్ స్టాన్పై 2014 నుండి నిఘా కొనసాగుతోంది. స్టాన్ స్వామిని పూనే పోలీసులు అరెస్టు చేయబోతున్నారని హ్యాకర్లకు ముందుగానే తెలిసిందంటూ పబ్లిక్ డొమైన్లో విడుదల చేసిన ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల విచారణలో వెల్లడవడం మరింత దిగ్భ్రాంతికరమైన అంశం. కేవలం ఒక్క రోజు ముందు మాత్రమే, వారి కార్యకలాపాలకు సంబంధించిన గుర్తులేవీ లేకుండా తుడిచేసేందుకు వారు ప్రయత్నించారు. అన్నింటికంటే అధ్వాన్నమైన అంశమేమంటే, స్టాన్ స్వామికి బెయిల్ తిరస్కరించడం, ఆయనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడానికి నిరాకరించడం, కస్టడీలో ఆయన మరణించడమంటే హత్యచేయడం తప్ప మరొకటి కాదని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. తానెన్నడూ చేయని ఒక నేరానికి నిందితుడిగా కస్టడీలో ఆయన మృతి చెందారు.
లక్ష్యంగా చేసుకున్న వారి కంప్యూటర్లను హ్యాక్ చేయడం, అందులో నకిలీ ఫైళ్ళను చొప్పించే ధోరణి కొనసాగిందని ఇతర నిందితుల కంప్యూటర్లపై జరిగిన ఫోరెన్సిక్ విచారణలో స్పష్టంగా వెల్లడైంది. ఈ క్రమంలో ఇది అటువంటి ఐదవ నివేదిక. ఈ ఫైళ్ళ గురించి నిందితులకు ఎలాంటి ఆలోచనా లేదు, అలాగే వారెన్నడూ ఒక్కసారి కూడా వీటిని చూడలేదని ఫోరెన్సిక్ విచారణలో రుజువైంది. బీమా కొరెగావ్ కేసులో నిందితులందరిపైనా ప్రధాన సాక్ష్యాధారంగా పేర్కొంటున్న ఈ నకిలీ ఫైళ్లలో చాలా వాటిని నిరంకుశ ఉపా నిబంధనల కింద దాచి వుంచారు.
ఈ సాక్ష్యాధారాలను గుర్తించడానికి ఎన్ఐఎ తిరస్కరించడం, వీటిపై తన స్వంత విచారణకు ఆదేశించడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఎన్ఐఎపై అధికారమున్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నివేదికలను గుర్తించడానికి తిరస్కరించడం కూడా ఖండించాల్సిన అంశమేనని పేర్కొంది.
గత నివేదికలతో పాటూ తాజాగా వెలువడిన ఈ నివేదిక ఈ ప్రభుత్వ హేయమైన నేరారోపణ. తమకు తాము తయారుచేసుకున్నవి మినహా ఇతర సాక్ష్యాధారాలు లేని వారిని లక్ష్యంగా చేసుకుని వారిని జైల్లో పెట్టడం ఎన్ఐఎ వ్యవహార ళైలిగా వుంది. ఈనాడు ఈ ప్రమాదకరమైన సాంకేతికతతో, మాల్వేర్తో లక్ష్యంగా మారింది బీమా కొరెగావ్ కేసులోని నిర్బంధితులే.
ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ఎవరైనా రేపు ఇదే రకంగా లక్ష్యంగా మారతారని సిపిఎం విమర్శించింది.
బీమా కొరెగావ్ కేసులోని నిందితులందరినీ తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. నిందితుల బెయిల్ దరఖాస్తులను లేదా విడుదల చేయాలని కోరుతున్న విజ్ఞప్తులను ఎన్ఐఎ తిరస్కరించరాదని కోరింది. అందుబాటులో వున్న ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్ట కాలపరిమితిలో నిపుణులచే, పున:పరిశీలన జరిపించాలని డిమాండ్ చేసింది.