Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హస్తిన నుంచి రాజకీయాలకు తొలి అడుగు
- బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం
- జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్
- మూడు పార్టీల నేతలు హాజరు
న్యూఢిల్లీ : ఇప్పటి వరకు తెలంగాణ నుంచి రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఇక నుంచి దేశ రాజధాని హస్తిన నుంచి రాజకీయాలు చేయనున్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ప్రస్థానానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది. బుధవారం నాడిక్కడ సర్దార్ పటేల్ మార్గ్‌లో రోడ్డు నెంబర్ 5లో జాతీయ నేతల సమక్షంలో, సొంత పార్టీ నేతల కోలాహలం మధ్య జాతీయ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తాత్కాలిక జాతీయ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అట్టహాసంగా ప్రారంభించారు. జై భారత్.. జై బీఆర్ఎస్ అంటూ కార్యాలయ ప్రాంగణమంతా నినాదాలు హౌరెత్తాయి. జాతీయ అధ్యక్షునిగా తన తొలి సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్ తరపున పలు నియామకాలను చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయ ప్రారంభంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్, హర్యానా రైతు సంఘం అధ్యక్షుడు గుర్నాం సింగ్ చారుని, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
కోలాహలం మధ్య ఎగిరిన బీఆర్ఎస్ జెండా
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణి దంపతులు, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం 12.37 గంటలకు కార్యకర్తల కోలాహలం మధ్య గులాబీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తరువాత కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్లో కేసీఆర్ ఆసీనులయ్యారు. అఖిలేశ్ యాదవ్, కుమారస్వామి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా తొలి సంతకం చేసి, బాధ్యతలను స్వీకరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్)ను ఏర్పాటు చేశారు. కిసాన్ సెల్ అధ్యక్షునిగా హర్యానాలోని కురుక్షేత్రకు గుర్నామ్ సింగ్ చారునిని నియమించారు. పార్టీ కార్యాలయ కార్యదర్శిగా రవి కొహార్‌ను నియమించారు. జాతీయ అధ్యక్షుని హౌదాలో తొలి నియామక పత్రాలను కేసీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కెేసీఆర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపి నామా నాగేశ్వరరావు తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్య అతిథులు, ఇతర ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చెర్మెన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. ఈ కార్యాలయంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, పువ్వాడ అజరు కుమార్, ఎంపిలు కె. కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, పసునూరి దయాకర్ రావు, మాలోత్ కవిత, మన్నె శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, పిజ రాములు, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చెర్మెన్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.