Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ మహాసభ తీర్మానం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-
కె వరదరాజన్ నగర్ (త్రిసూర్)
రైతులు పండించే ప్రధాన పంటలన్నింటికీ కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్ట బద్ధత కల్పించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఏఐకేఎస్ మహాసభ డిమాండ్ చేసింది. ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అయిన చట్ట బద్ధతను సాధించేందుకు ఐక్య ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం మహాసభ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానాన్ని ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు అమ్రారామ్ ప్రతిపాదించారు. తీర్మానంలోని ముఖ్యాంశాలు... నయా-ఉదారవాద విధానాలొచ్చాక వ్యవసాయానికి ప్రభుత్వ నిధులు, సబ్సిడీలు, బ్యాంక్ అప్పులు బాగా తగ్గాయి. మరో వైపు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర ఉత్పాదకాల ధరలు విపరీతంగా పెరిగాయి. డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం రైతులపై ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో పంటలకు ధరలు పడిపోయాయి. ప్రభుత్వం రైతుల వద్ద నుంచి కొంటున్న వరి, గోధుమ ధాన్యాలు చాలా తక్కువ. ఇతర పంటలకు ఎంఎస్పీ లేనే లేదు. ప్రభుత్వ సబ్సిడీలు తగ్గడం, ఉత్పాదకాల ధరలు పెరగడం, పంటల ధరలు దిగజారడం వలన రైతులు నష్టపోతున్నారు. ఇంకోవైపు ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ప్రజల ఆహార భద్రత ప్రమాదంలో పడింది. ప్రధాన పంటలన్నింటికీ, పశుసంవర్ధక ఉత్పత్తులు, చిన్న అటవీ ఉత్పత్తులకు ఎంఎస్పిని గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించాలి. వ్యవసాయానికి ప్రభుత్వ నిధులు పెంచాలి. అలా చేస్తే పంట ఉత్పాదకాలు, సర్వీసులు, వ్యవసాయ ఖర్చులు తగ్గుతాయి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పంట పండించడానికి రైతులు చేసే ఖర్చుకు యాభై శాతం కలిపి ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించాలి. వరి, గోధుమలతో సహా ఇతర పంటల సేకరణకు, నిల్వకు సదుపాయాలు కల్పించాలి. పంటల సేకరణ, ఆహార పంపిణీ, గోదాముల వ్యవస్థలలో సహకార రంగాన్ని ప్రోత్సహించాలి... అని మహాసభ తీర్మానించింది. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్స్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని పి షణ్ముగం ప్రవేశపెట్టాగా వి కృష్ణయ్య బలపరిచారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మికులు చేసే పోరాటాలకు ఏఐకేఎస్ సంపూర్ణ మద్దతిస్తుందని, కార్మికులు- కర్షకులు ఐక్యంగా పోరాడాలని మహాసభ పిలునిచ్చింది. అటవీ హక్కుల చట్టం అమలుకు, మహిళా రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల రక్షణ కోరుతూ మరో రెండు తీర్మానాలను మహాసభ ఆమోదించింది. మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహించిన మహత్తర పోరాటానికి సంబంధించిన కథనాలతో ఆంగ్లంలో సుందరయ్య ట్రస్టు ప్రచురించిన పుస్తకాన్ని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ మహాసభ వేదికపై ఆవిష్కరించారు. మొదటి ప్రతిని వెంకటేష్ ఆత్రేయ అందుకున్నారు. పుస్తకావిష్కరణ సభలో అశోక్ ధావలే, హన్నన్ మొల్లా, సారంపల్లి మల్లారెడ్డి, విజూ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
స్పూర్తి నింపిన చర్చలు
ఏఐకేఎస్ మహాసభ రెండవ రోజు బుధవారం ప్రతినిధుల చర్చలు ఉత్సాహపూరితంగా జరిగాయి. ఈ కాలంలో నిర్వహించిన పోరాటాలను, ఎదురైన అనుభవాలు, సవాళ్లపై సింహావలోకనం చేసుకున్నారు. సాధించిన విజయాలను తెలిపినప్పుడు ప్రతినిధులు స్పూర్తి పొందారు. మహాసభ ఇచ్చే భవిష్యత్ కర్తవ్యాల సాధనకు ప్రతిన బూనారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆ రాష్ట్ర ప్రతినిధి బొంతు రాంబాబు తెలిపారు. రైతు బంధు పథకంతో భూస్వాములు, సాగుతో సంబంధం లేని బ్యూరోక్రాట్ల వంటి వారు కూడా లాభపడుతున్నారన్నారు.