Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్సభలో బీజేపీ ఎంపీ ప్రీతం ముండే డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో మైనారిటీ వర్గాలకు అందిస్తున్న స్కాలర్షిప్స్ను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ ప్రీతం ముండే వ్యతిరేకించారు. ఈ నిర్ణయంపై పునరాలోచించి ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం లోక్సభలో ప్రీతం ముండే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మౌలానా ఆజాద్ ఫెలోషిప్ రద్దు చేశారనీ, అలాగే.. 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు సైతం ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్స్ ఎత్తివేయడం ఆందోళనకరమని అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందనీ, ఈ ఏడాది కూడా వేలాది మంది విద్యార్థులు ఈ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8వ తరగతి చదువుతున్న వారికి విద్య ఉచితమేననీ, అయినా.. ఉపకార వేతనాలు ఇస్తే పాఠశాలల్లో విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. విద్యార్థులు బాల కార్మికులుగా మారకుండా ఉండటంతో పాటు బడిబాట పట్టేందుకు ఉపకార వేతనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్న కోణంలో ఆలోచించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవా లని కోరారు. ముస్లిం, బౌద్ధ, జైన, క్రైస్తవ, సిక్కు, పార్సీ విద్యార్థులు పీహెచ్డీ కోర్సులు చదవడానికి ఇచ్చే ఐదేండ్ల మౌలానా ఆజాద్ పెలోషిప్ను రద్దు చేయడం, 1 తరగతి నుంచి 8 తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలనూ నిలిపివేయడంపై లోక్సభలో పలువురు ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. మరోవైపు, జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ అధ్యాపక సంఘం (జేఎన్యూటీఏ) కూడా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నది. జేఎన్యూతోపాటు దేశంలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.