Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖజానాకు ఆదా
- రాజ్యసభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ : లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖజానాకు భారీగా ఆదా అవుతుందని తెలిపారు. ఎన్నికలు ''భారీ బడ్జెట్ వ్యవహారం, ఖరీదైనవి''గా మారాయని, లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల చట్టాలలో సంస్కరణలపై లా కమిషన్ తన 170వ నివేదికలో పాలనలో స్థిరత్వం కోసం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించిందని తెలిపారు. ''ఏకకాల ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అవుతుంది. పరిపాలనా, శాంతి భద్రతల యంత్రాంగాల నిర్వహించడంతో పాటు పదేపదే ఎన్నికలు నిర్వహించడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో గణనీయమైన పొదుపు అవుతుంది'' అని రిజిజు అన్నారు. అప్పుడు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సుదీర్ఘంగా అమలు చేయడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని కూడా ఏకకాలంలో ఎన్నికలు అరికట్టగలవని ఆయన పేర్కొన్నారు. 1951-52, 1957, 1962, 1967లో లోక్సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయనీ, అయితే, 1968, 1969లో కొన్ని శాసనసభలను ముందస్తుగా రద్దు చేయడం వల్ల ఈ చక్రానికి అంతరాయం కలిగిందని తెలిపారు.
పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ అవసరం లేదు
పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. 1985లో 52వ రాజ్యాంగ సవరణ చేసి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రాజ్యాంగంలో 10 షెడ్యూల్లో చేర్చారని తెలిపారు. ఇది మరొక రాజకీయ పార్టీకి ఫిరాయింపు కారణంగా ఎన్నికైన సభ్యులను అనర్హులుగా ప్రకటించే నిబంధనలను నిర్దేశిస్తుందనీ, ఇటీవలి కాలంలో పదో షెడ్యూల్ అమలు కారణంగా ఫిరాయింపుల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని చెప్పారు. పదో షెడ్యూల్లోని నిబంధనలు కాలపరీక్షకు, అనేక న్యాయపరమైన పరిశీలనలకు నిలిచినందున, ఇప్పటికిప్పుడు ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొన్నారు.
దేశంలో 28,46,43,842 మంది అసంఘటిత రంగ కార్మికులు
దేశంలో 28,46,43,842 మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 11 వరకు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులు 31 రంగాలకు చెందిన 28,46,43,842 మంది ఉన్నారని తెలిపారు.
రూ.581 నుంచి
రూ.1,053కి పెరిగిన గ్యాస్ ధర
దేశంలో రెండున్నరేండ్లలో వంట గ్యాస్ ధర దాదాపు రూ.500 వరకు పెరిగింది. ఈ మేరకు లోక్సభలో ఒకప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మే 1 నాటికి దేశంలో వంట గ్యాస్ ధర రూ.581 ఉండగా, అది 2022 డిసెంబర్ 1 నాటికి రూ.1,053కి పెరిగింది.
ప్రభుత్వ రంగం బీమా కంపెనీల్లో ఐదేండ్లలో 20 శాతం ఉద్యోగులు తగ్గుదల
గత ఐదేండ్లలో ప్రభుత్వ రంగ బీమా కంపెనీ (పీఎస్ఐసీ)ల్లో ఉద్యోగుల సంఖ్య 20 శాతం తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం అడిగిన ప్రశ్నకు ఆయన లికితపూర్వక సమాధానం ఇచ్చారు. 2018 మార్చి 31 నాటికి ఏడు బీమా కంపెనీల్లో 1,73,797 మంది ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 1,48,266 మంది ఉద్యోగులకు పడిపోయిందని తెలిపారు. ఈ కాలంలో 34,531 మంది ఉద్యోగులు తగ్గారు.