Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెయిరీ దిగుబడుల సరళీకరణ ఆపాలి
- ఏడు తీర్మానాలు ఆమోదించిన ఏఐకెేఎస్ మహాసభ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
- కె వరదరాజన్ నగర్ (త్రిసూర్)
ప్రభుత్వరంగ కంపెనీలతోనే పంటల బీమాను అమలు చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 35వ మహాసభ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. విపత్తుల వలన పంట నష్ట పోయిన రైతాంగానికి పారదర్శకంగా తక్షణం పరిహారం చెల్లించాలని కోరింది. కంపెనీల నుంచి క్లెయిముల పరిష్కారం కోసం రైతులను సమీకరించి ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చింది. మూడవ రోజు గురువారం మహాసభ ఏడు తీర్మానాలను ఆమోదించింది. క్రాప్ ఇన్సూరెన్స్ తీర్మానంలోని ముఖ్యాంశాలు... కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రైవేటు కంపెనీల దోపిడీకి ఉపయోగపడుతోంది. రైతులకు ఏ మాత్రం ప్రయోజనం కలగట్లేదు. పంటల బీమా పథకాలను ప్రభుత్వ కంపెనీలతోనే అమలు చేయాలి. తక్షణం ప్రయివేటు కంపెనీల జోక్యాన్ని నిలిపేయాలి. జావాబుదారీతనం, పారదర్శకత, వేగంగా క్లెయిముల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలి. కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రాలు తాము సొంతంగా ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేయదలుచుకుంటే అందుకు అవసరమైన ఆర్థిక వనరులను కేంద్రం సమకూర్చాలి. పంట నష్టం అంచనాలు, సర్వే వంటి విషయాల్లో నియంతృత్వ ధోరణిని తొలగించి రైతులకు క్లెయిములు పరిష్కారం చేసేందుకు స్నేహపూర్వకంగా వ్యవహరించాలి...
డెయిరీ ఉత్పత్తులకు గిట్టుబాటు
దేశంలోకి పాల ఉత్పత్తుల దిగుబడులపై ఉన్న ఆంక్షలను సరళీకరిస్తూ మోడీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఉపసంహరించుకోవాలని మహాసభ తీర్మానించింది. నిజమైన సహకార వ్యవస్థను డెయిరీలో ప్రవేశపెట్టి విధానపరంగా ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలని, పాల రైతుల ఖర్చులు తగ్గించాలని, డెయిరీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పశువుల రవాణాకు అనుమతించాలని, పశువుల రవాణాపై ఆంక్షలు విధిస్తూ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను రద్దు చేయాలని, గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను అరికట్టాలని మహాసభ తీర్మానం ఆమోదించింది.
వాతావరణ మార్పులపై..
వాతావరణ మార్పుల వలన అకాల వర్షాలు, వరదలు, కరువులు వచ్చి రైతులు పంటలు నష్టపోతున్నారని మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి చేసి వారి పాత్ర పెంచాలని డిమాండ్ చేస్తూ తీర్మానించింది. వాతావరణ మార్పుల వలన పంటలకు జరుగుతున్న నష్టంపై దేశంలోని వాతావరణ జోన్ల ప్రాతిపదికన శాస్త్రీయంగా అధ్యయనం చేసి పరిష్కారాలు కనుగొనాలి. రైతులను ముందస్తుగా అప్రమత్తం చేయాలి. కార్పొరేట్లకు కాకుండా వ్యవసాయం రైతులకు గిట్టుబాటయ్యే విధంగా చర్యలు చేపట్టాలి... అని డిమాండ్ చేసింది. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి గిరిజనులకు భూములపై హక్కులు కల్పించాలని, ప్రజలందరికీ ఆహారభద్రత కల్పించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, చక్కెర రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, వన్య మృగాలు, జంతువుల బారి నుంచి పంటలను, ప్రజలను రక్షించాలని మహాసభ తీర్మానాలు చేసింది.
మూడు కమిషన్లు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభ మూడు కమిషన్లు వేసింది. భూమి సంబంధ విషయాలు, పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లకు చట్ట బద్ధత, వ్యవసాయరంగంలోకి ఫైనాన్స్ పెట్టుబడులపై కమిషన్లు విస్తృతంగా చర్చలు జరిపాయి. ప్రతినిధులు మూడు కమిషన్ల సమావేశాల్లో పాల్గొన్నారు.
సంఘ బలోపేతానికి హామీ
మహాసభలో ఏఐకేఎస్ నిర్మాణంపై ప్రతినిధులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు. సంఘాన్ని విస్తరించి బలోపేతం చేస్తామని, వచ్చే మూడు నాలుగేండ్లలో సభ్యత్వాన్ని లక్ష్యానికనుగుణంగా పెంచుతామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హేమలత మాట్లాడుతూ వచ్చే మహాసభ నాటికి రాష్ట్రంలో సభ్యత్వాన్ని 5 లక్షలకు పెంచుతామన్నారు. కౌలు రైతుల సంఘం ప్రత్యేకంగా ఉందని, ఆ సంఘ సభ్యత్వాన్ని లక్షా 50 వేలకు పెంచుతామని చెప్పారు. భూమి సంబంధ సమస్యలు ముందుకొస్తున్నాయని, వాటిపై కేంద్రీకరించి పని చేస్తామన్నారు. నల్ల వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంతో ఏఐకేఎస్ ప్రతిష్ట పెరిగిందని, నిర్మాణానికి ఉపయోగపెట్టుకుంటామని, స్వతంత్ర, ఐక్య కార్యాచరణ చేపడతామని వివరించారు. తెలంగాణ నుంచి సుధాకర్‌రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు కె హేమలత సౌహార్ద సందేశమిచ్చారు.