Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన
- కేంద్రమంత్రి ప్రకటనపై నిరసన గళం...వాకౌట్
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఇచ్చిన సమాధానంపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, సీపీఐ(ఎం), వైసీపీ, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ సహా ప్రతి పక్షాలు లోక్‌సభలో వాకౌట్ చేశాయి. గురువారం లోక్‌సభ లో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ధరలపై కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ, ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర అత్యల్పంగా ఉన్నదని తెలిపారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు 40 శాతం పెరిగితే దేశంలో కేవలం రెండు శాతం మాత్రమే పెరిగిందని అన్నారు. 1974 తరువాత ఇదే అత్యల్ప పెరుగుదలని చెప్పుకొచ్చారు. గత ఎనిమిదేం డ్లలో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా తక్కువగా పెరిగాయన్నారు. ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చు, బీమా చార్జీలు, కరెన్సీ మారకం వంటి జాతీయ, అంతర్జాతీయ కారణాల వల్ల పెట్రోల్, డిజిల్ ధరలను నిర్ణయిస్తామని చెప్పారు. దీనికి అదనంగా డీలర్ వాటా లాభం, ఆ తరువాత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీతో పాటు రాష్ట్రాల వ్యాట్ ఉంటుందని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కారణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.27,276 కోట్ల నష్టాన్ని చవిచూశాయని చెప్పారు. ఇదే సమయంలో చాలా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయని, కానీ ఆరు బీజేపీయేతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్‌లు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గించకపోవడంతో అక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. కొన్ని రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రూ.17 వ్యాట్‌ను వసూలు చేయగా, కొన్ని రాష్ట్రాలు రూ.32 వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ప్రకటనలపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు సీపీఐ(ఎం), వైసీపీ, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ, ఆర్ఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, సీపీఐ, ఐయుఎంఎల్ వంటి పార్టీలు కేంద్ర మంత్రి సమాధానంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ, 'ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు తమ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ని తగ్గించేలా చూడాలని నేను సూచిస్తున్నాను. తద్వారా వారు కూడా వేడుకల్లో పాల్గొనవచ్చు' అని అన్నారు. కేంద్రమంత్రి సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. వైసీపీ లోక్‌సభా పక్ష నేత పివి. మిథున్ రెడ్డి, మార్గాని భరత్, లావు కృష్ణదేవరాయలు, బీశెట్టి సత్యవతి, జి.మాధవి తదితరులు మిగతా విపక్ష సభ్యులతో కలిసి వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లారు.