Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల కోసమే సుప్రీం ఉన్నది : సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: పౌరుల స్వేచ్ఛ, హక్కుల రక్షణ విషయంలో స్పందించకుంటే సుప్రీంకోర్టు ఉన్నదెందుకు? అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టుకు ప్రతి కేసూ ముఖ్యమైందేనని, చిన్నది.. పెద్దది అనే తేడా లేదని ఆయన అన్నారు. పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర న్యాయమంత్రి కిరణ్ రిజుజు సుప్రీంకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సీజేఐ నుంచి స్పందన రావటం ఆసక్తిరేపింది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘన కేసులు అత్యంత ప్రాధాన్యత కలిగినవని, భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ప్రసాదించిన ప్రత్యేక అధికారాల్ని వినియోగించైనా ప్రాథమిక హక్కుల రక్షణకు పాటుపడతామని సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పి.ఎస్.నర్సింహా నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విద్యుత్ చట్టం కింద ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇక్రామ్ అనే వ్యక్తిపై 9 క్రిమినల్ కేసులు నమోదుకాగా, అక్కడి ట్రయల్ కోర్టు ప్రతి కేసులో రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా..ట్రయల్ కోర్టు తీర్పునే ఖరారు చేసింది. ఈ శిక్షలు అమలైతే తాను 18ఏండ్ల పాటు జైల్లో మగ్గిపోవాల్సి ఉంటుందని ఇక్రామ్ సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. పౌరుల స్వేచ్ఛ, ప్రాథమిక హక్కు అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీనికి భంగం కలిగిందని పిటిషనర్ ఆశ్రయిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని సుప్రీం తెలిపింది. ట్రయల్ కోర్టు తీర్పులో తీవ్రమైన దోషాలున్నాయని, దీంట్లో పిటిషనర్‌కు హైకోర్టు న్యాయం చేసి ఉండాల్సిందని, అలా జరగలేదని సీజేఐ వ్యాఖ్యానించారు. మొత్తం 9 కేసుల్లో ఇక్రామ్‌కు విధించిన శిక్షాకాలాన్ని రెండేండ్లకు తగ్గించింది. ప్రతి కేసులోనూ కింది కోర్టు విధించిన జరిమానా మాత్రం చెల్లించాలని ఆదేశించింది. పౌరుల స్వేచ్ఛ, హక్కులకు న్యాయస్థానాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఈసందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది.