Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గృహ కార్మికులపై ఐఐహెచ్ఎస్ అధ్యయనం
నోయిడా: రోజురోజుకు ధరలు పెరుగుతున్న నేటికాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారు. చదువుకున్న యువతీయువకులకు ఉద్యోగా లు రాక అవస్థలు పడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో తమ పనికి ఎలాంటి గుర్తింపు లేని, భద్రత లేని గృహ కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. వారెంత పనిచేసినా వారిపట్ల సమాజం చిన్నచూపే చూస్తోంది. ఒకవైపు జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో గృహ కార్మికుల వేతనాలను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. కరోనా తర్వాత వారి జీవన పరిస్థితి మరింత దిగజారింది. నేటి పరిస్థితుల్లో వారు కనీస వేతనం పొందాలంటే.. దాదాపు ఆరు ఇండ్లల్లో పనిచేయాల్సి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉన్న గృహ కార్మికుల వేతనాలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ (ఐఐహెచ్ఎస్) అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో గృహ కార్మికుల వెతలు బహిర్గతమయ్యాయి. భారతదేశంలో అధికారిక గణాంకాల ప్రకారం 4.75 మిలియన్ల మంది గృహ కార్మికులున్నారు. కేంద్రపాలిత రాష్ట్రాలతో సహా 31 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాలు మాత్రమే గృహ కార్మికులను కనీస వేతన చట్టాల షెడ్యూల్లో చేర్చాయి. బెంగళూరు, చెన్నై నగరాల్లో తక్కువ, మధ్యస్థ - అధిక అదాయం వస్తున్న 9,636 కుటుంబాలను ఐఐహెచ్ఎస్ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో చెన్నైలో తక్కువ నుంచి అధికాదాయం ఉన్న గృహ యజమానుల నుంచి గృహ కార్మికులు నెలకు రూ.1000 నుంచి రూ.10,000 వరకు జీతం తీసుకుంటున్నారని తేలింది. ఇక బెంగళూరులో అయితే.. రూ.2వేల నుంచి రూ.13 వేల వరకు గృహ కార్మికుల నెలసరి వేతనాలున్నాయని అధ్యయనంలో తేలింది. కర్నాటకలో గృహ కార్మికుల కనీసం వేతనం రూ.12,241 నుంచి రూ.14,711 వరకు ఉంది. ఇక చెన్నైలో అయితే వీరి కనీస వేతనం రూ.8,005, రూ.9,418గా ఉంది. ఈ లెక్కల ప్రకారం... గృహ కార్మికులు కనీస వేతనం పొందాలంటే బెంగళూరులో కనీసం ఆరు ఇండ్లలోనూ, చెన్నైలో అయితే... ఎనిమిది ఇండ్లలోనూ పనిచేయాల్సి వుందని ఐఐహెచ్ఎస్ నివేదిక పేర్కొంది.
నో బోనస్... ఇంక్రిమెంట్స్...
గృహ కార్మికులు ఎంత కష్టపడినా.. యజమానుల దయాదాక్షిణ్యాలపైనే వారి వేతనం ఆధారపడి ఉంటుంది. వారికి వేతనం పెంచమని అడిగే హక్కు లేదు. ఇక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు వంటివి పొందే అవకాశమే లేదు. ఇక వీరి వేతనాల పరంగా చూసుకుంటే.. అధిక ఆదాయ కుటుంబాల కు చెందిన యజమానులు 51 శాతం మంది వారి అవసరాలకు తగినట్టుగా చెల్లించడం జరిగిందని ఐఐహెచ్ఎస్ నివేదిక పేర్కొంది. అలాగే తక్కువ, మధ్యస్త ఆదాయ కుటుంబాల వారు ఉదాసీనంగానే వేతనాలు చెల్లించడం జరుగుతుందని నివేదికలో పేర్కొంది. సెలవుల విషయానికొస్తే.. బెంగళూరులో 68 శాతం, చెన్నైలో 80 శాతం కుటుంబాలు వారానికొకరోజు సెలవు ఇస్తాయని ఐఐహెచ్ఎస్ అధ్యయనంలో తేలింది. గృహ కార్మికులు గర్భం దాల్చితే.. బెంగళూరులో 62 శాతం, చెన్నైలో 32 శాతం కుటుంబాలు.. వారి సేవలు నిలిపివేయడానికి ఇష్టపడతాయని అధ్యయనం వెల్లడించింది. గృహ కార్మికులు అనారోగ్యానికి గురైతే.. బెంగళూరులో 41 శాతం, చెన్నైలో 37 శాతం కుటుంబాలు చికిత్స ఖర్చులకు డబ్బులు ఇస్తున్నట్టు యజమానులు చెప్పారు. 59 శాతం కుటుంబాలు వేతనంతో కూడిన సెలవును సమర్థించాయి. 36 శాతం మంది లీవ్‌లు చెల్లించకుండా ఉండాలని చెప్పారు. ఇక యజమా నులను.. రిటైర్డ్ గృహ కార్మికులకు అందించే పెన్షన్ గురించి అధ్యయనంలో పేర్కొనలేదు.
వివక్షకూ గురవుతున్న గృహ కార్మికులు
ప్రధానంగా బెంగళూరు, చెన్నై నగరాల్లో గృహ కార్మికులను నియమించుకోవడానికి ప్రధాన కారణం... పిల్లలు, పెద్దల సంరక్షణ కోసమో, లేదా.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో పని భారం తగ్గించుకోవడానికేనని ఈ అధ్యయనంలో వెల్లడైంది. బెంగళూరులో 54 శాతం మంది, చెన్నైలో 32 శాతం కుటుంబాలు ఈ కారణాల వల్లనే గృహ కార్మికుల్ని నియమించు కొంటున్నారు. గృహ కార్మికుల ఇంటి పేరు.. వారు నివాసముండే ప్రదేశాలను పరిగణనలోకి తీసుకుని మరీ.. గృహ యజమానులు వారికి పని ఇవ్వడం జరుగుతుందని ఈ నివేదిక వెల్లడించింది. గృహ కార్మికులు ఇంటి పని చేసే ముందు వారి కులాన్ని పరిగణనలోకి తీసు కుంటున్నారని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రోసా అబ్రహం అనే ఆర్థికవేత్త అన్నారు.