Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏండ్ల బాలికపై యాసిడ్ దాడి ఘటనలో ప్రముఖ ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్లో యాసిడ్ అమ్మినందుకుగాను వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారల మంత్రిత్వ శాఖ ఫ్లిప్‌కార్టును ఆదేశించింది. ఏడు రోజుల్లోగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో యాసిడ్ లభ్యతపై నెలకొన్న భయాందోళనలను పరిష్కరించడానికి అవసరమైన పత్రాలతోపాటు ప్రతిస్పందనను తెలియజేయాలని మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కోరింది. ఆన్లైన్లో యాసిడ్‌ను విక్రయించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆక్షేపించింది. ఈ నెల 14న ఢిల్లీలో బాలికపై జరిగిన ఘటనలో నిందితులు ఫ్లిప్‌కార్టులో యాసిడ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ఈ-కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు చెల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న 17 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడి చేశారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లోని మోహన్ గార్డెన్ సమీపంలో బాధితురాలు వెళ్తుండగా.. ముఖానికి ముసుగులతో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఈ దురాగతానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు సఫ్దార్జంగ్ దవాఖానకు తరలించారు. ముఖంతో పాటు కండ్లలో కూడా యాసిడ్ పడిందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి స్థిరంగా ఉన్నదని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.