Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరేండ్లలో 6,712 కోట్లు కేటాయింపు..రూ.4480 కోట్లు విడుదల
- నిధుల కేటాయింపు,వ్యయం గందరగోళం :రాజకీయ విశ్లేషకులు
- దేశంలో సగటున రోజుకు 87 లైంగికదాడి ఘటనలు
- ఢిల్లీలో ప్రతిరోజూ 5.6 కేసులు..
- నిర్భయ ఘటనకు10ఏండ్లయినా పరిస్థితిలో మార్పురాలేదు..
న్యూఢిల్లీ: డిసెంబర్ 16, 2012న దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిర్భయ లైంగికదాడి, హత్య ఘటన దేశ ప్రజల్ని వణికించింది. కదులుతున్న బస్సులో లైంగికదాడికి దిగిన దుండగుల దుశ్చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేగాయి. ముఖ్యంగా నగరాల్లోని ప్రజలంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాలకుల తీరును ఖండిస్తూ ర్యాలీలు, ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన జరిగి 10ఏండ్లు దాటుతోంది. అయినా ఢిల్లీ సహా అనేక నగరాల్లో మహిళలకు రక్షణ కొరవడింది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళలు రాత్రివేళ ఇంటికి తిరిగి వెళ్తూ ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. ఆనాటి ప్రజా ఆగ్రహాన్ని చల్లార్చడానికి యూపీఏ ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చింది. నిర్భయ ఫండ్‌ను ఏర్పాటుచేసింది. మహిళల రక్షణ నిమిత్తం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు ఆనాటి పాలకులు ప్రకటించారు. కేంద్రంలో 2014లో మోడీ సర్కార్ అధికారం చేపట్టాక నిధుల్ని సగాకి తగ్గించేసింది. 2018-19లో అత్యంత తక్కువగా కేవలం రూ.500కోట్లను నిర్భయ ఫండ్‌కు కేంద్రం ట్రాన్స్ఫర్ చేసింది. గత 8ఏండ్లుగా ఈ ఫండ్ లెక్కలు అంత గందరగోళంగా తయారయ్యాయి. కేంద్రం విడుదల చేస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయికి పరిస్థితికి పొంతన ఉండటం లేదనే విమర్శలున్నాయి.
కేటాయించిన నిధుల్లో 66శాతం విడుదల
నిర్భయ ఫండ్ ఏర్పాటైన తర్వాత అప్పట్నుంచీ ఆగస్టు 2022 వరకు కేంద్రం రూ.6712 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందులో విడుదలైన నిధులు రూ.4480 కోట్లు. కేటాయించిన నిధుల్లో ఇది కేవలం 66శాతం మాత్రమే. మిగిలిన రూ.2232 కోట్లు నిధులు ఏమయ్యాయో స్పష్టత లేదు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మహిళలపై హింస, లైంగికదాడులు మితిమీరుతున్నాయి. దేశంలో సగటున రోజుకు 87 లైంగికదాడి ఘటనలు జరుగుతున్నాయి. లైంగికదాడి కేసులు ఏటా 13శాతం పెరుగుతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొన్నది. బాధితుల్లో దళిత సామాజికవర్గానికి చెందినవారు 12శాతం మంది ఉన్నారు. నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో ఇంకా పరిస్థితి మెరుగుపడలేదని పోలీసులే చెబుతున్నారు. ప్రతిరోజూ సగటున 5.6 లైంగికదాడి కేసులు పోలీస్ స్టేషన్లో నమోదవుతున్నాయి. నిర్భయ చట్టం పకడ్బంధీగా ఉన్నా..నిర్భయ కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. నిందితులకు సులభంగా బెయిల్ దక్కుతోంది. విచారణ ఏండ్లుగా సాగటంతో ప్రత్యక్ష సాక్షులు గట్టిగా నిలబడలేకపో తున్నారు. ఇదంతా కూడా నిందితులకు కలిసివస్తోంది.
పాలకుల నిర్లక్ష్యం
నిర్భయ ఘటన తర్వాత మహిళా రక్షణపై పాలకులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. మహిళలపై లైంగికదాడి, హింసను అడ్డుకోవటమే లక్ష్యంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం 'నిర్భయ ఫండ్'ను రూ.1000 కోట్లతో ఏర్పాటుచేసింది. లైంగికదాడి బాధితులకు సాయం, పునరావాసం కోసం ఈ ఫండ్స్‌ను రాష్ట్రాలు వినియోగిం చుకోవాలి. లక్ష్యం, ఉద్దేశాలు మంచివే అయినా కేంద్రంలో పాలకులు 'నిర్భయ ఘటన'ను నిర్లక్ష్యం చేశారు. దాంతో వివిధ నగరాల్లో మహిళా రక్షణ మెరుగుపడలేదు. ఫండ్స్ విడుదలపై లోక్‌సభలో ఆమధ్య కేంద్రమంత్రి స్మృ తి ఇరానీ మాట్లాడారు. ఆరేండ్లలో కేంద్రం నుంచి 36 రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు విడుదలయ్యాయి. తమకు విడులైన నిధుల్లో 60శాతం కూడా ఖర్చు చేయని రాష్ట్రాలు 17 ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు విడుదల కావటం ఒక పెద్ద ప్రహసనంగా ఉందని, నిధుల కేటాయింపునకు, విడుదలకు పొంతనలేకపోవటంపై ఫిర్యాదులు వస్తున్నాయి.చట్టం అమలు పకడ్బంధీగా ఉండటంతోపాటు, సామాజిక దృక్పథాన్ని మార్చుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ''సమాజం ఆలోచన మారనంత వరకు మహిళలకు సమాన హోదా, భద్రత లభించదు. సమాజంలో సగభాగమైన మహిళలకు సురక్షితమైన స్థలాన్ని సృష్టించడం అందరి బాధ్యత'' అని మహిళా హక్కుల కార్యకర్తలు నినదిస్తున్నారు. లింగ సమస్యలపై సున్నితంగా ఉండాలని, పాఠశాలల్లో కార్యక్రమాలు ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.