Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లుగా పెరుగుతోన్న నిరుద్యోగ రేటు
నేను పనిచేస్తున్న కంపెనీ ప్రధాన కార్యాలయం బెంగుళూర్లో ఉంది. ఐటీ కంపెనీలన్నీ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని తొలగించాయి. నేను పనిచేసిన కంపెనీ ఏకంగా మూతపడింది. నాతో సహా వందలాది మందికి 8 నెలల జీతం బాకీ ఉంది. కేంద్ర కార్మిక మంత్రి, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రికి, బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేశాం. మా గోడు వినే నాథుడే లేడు''..ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి సందేశం ఇది. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- డిసెంబర్ 16నాటికి 9.3శాతం : సీఎంఐఈ
- కరోనాకు ముందు నిరుద్యోగులు 4.5 కోట్లు...తర్వాత 5.1కోట్లు
- ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతున్నా..మోడీ సర్కార్ మౌనం
- 10 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ జూన్‌లో రోజ్‌గార్ మేళా పేరుతో హడావిడి
- కొద్దిరోజులు ఘనమైన ప్రచారం..ప్రకటనలు
న్యూఢిల్లీ : ఉపాధి సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. ఉన్నత చదువులు పూర్తిచేసినవారు, పనిచేయగల స్థితిలో ఉన్నవారికి ఉపాధి దొరకటం లేదు. అంతేగాక పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న 35 నుంచి 43ఏండ్ల వయస్సున్న వారూ నిరుద్యోగులుగా మారుతున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగరేటు ప్రతినెలా పెరుగుతూనే ఉంది. కరోనా సంక్షోభ పరిస్థితులు తగ్గుముఖం పట్టినా..ఉపాధి మాత్రం మెరుగుపడటం లేదు. డిసెంబర్ 16నాటికి భారత్‌లో నిరుద్యోగరేటు 9.3శాతానికి చేరుకుందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' (సీఎంఐఈ) తాజాగా గణాంకాలు విడుదల చేసింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిరంతరం పిరియాడిక్ శాంపిల్ సర్వేలు చేపడుతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఉపాధి తీరు అత్యంత నిరుత్సాహంగా ఉందని, ఉపాధి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నవారిలో కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు దక్కటం లేదని నివేదిక పేర్కొన్నది. కరోనాకు ముందునాటి 2019తో పోల్చితే నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని తెలిపింది.
ప్రకటనలకు పరిమితం
దేశవ్యాప్తంగా కార్మికరంగంలో నవంబర్, 2022నాటికి 40.18కోట్లమంది ఉపాధి పొందుతున్నారు. కరోనా సంక్షోభం రాకముందు నవంబర్, 2019లో ఉపాధిపొందేవారి సంఖ్య 40.3కోట్లు. గత మూడేండ్లుగా ఉపాధి రంగం స్తుబ్దుగా ఉండిపోయిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కార్మికరంగంలో ప్రవేశించాలని ఎంతోమంది తాపత్రయ పడుతున్నా, వారికి సరైన ఉపాధి లభించటం లేదని తెలుస్తోంది. నిరుద్యోగం తీవ్రరూపం దాల్చుతోందని ప్రతిపక్షాలు, యువత ఆందోళనలు చేపడుతున్నప్పుడల్లా, ఉద్యోగాల భర్తీపై బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. 10 లక్షల ఉద్యోగ ఖాళీలు (రోజ్‌గార్ మేళా) చేపడతున్నామని ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. కేంద్రంలోని అన్నిశాఖల్లోనూ నియామకాలుంటాయని తెలిపారు. కొద్ది రోజులు గడిచాక..మళ్లీ అంతా మామూలే. ఆందోళనలు, నిరసనలు, యువత ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఇదొక ఎత్తుగడగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రోజ్‌గార్ మేళా ఆర్భాటం
ప్రధాని మోడీ ప్రకటించిన 'రోజ్‌గార్ మేళా' ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది. దేశంలో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్ట్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన చేశామని ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి పొందుతున్నవారి లెక్కలూ 'రోజ్గగార్ మేళా'లో వేస్తున్నారు. వారు ఉపాధి పొందటం తన ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా, అధిక ధరలు వేధిస్తున్నా..ప్రధాని మోడీ మాత్రం నోరు మెదపటం లేదు. కఠినమైన మౌనం పాటిస్తున్నారు. దేశంలో బడా కార్పొరేట్ల వ్యాపారాలు, వాణిజ్యం పుంజుకున్నాయి. పెద్ద పెద్ద సంస్థల లాభాల మార్జిన్ ఎన్నోరెట్లు పెరిగింది. అయితే ఇదంతా ఉపాధి రహిత వృద్ధిగా నిపుణులు చెబుతున్నారు. అందువల్లే దేశంలో అసమానతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని అన్నారు. స్టాక్మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల లాభాల వృద్ధిని ఆర్థిక వృద్ధిగా భావించలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉపాధి వేట
2019లో కార్మికరంగంలో ఉపాధి పొందేవారి సంఖ్య 44.2కోట్లుగా ఉంది. ఇది 2020లో 42.4 కోట్లకు పడిపోయింది. అటు తర్వాత 2021లో 43.5 కోట్లకు, 2022లో 43.7 కోట్లకు చేరుకుంది. ఈ మధ్యకాలంలో డిగ్రీలు, ఉన్నత చదువులు పూర్తిచేసుకున్న కొత్తవారెంతో మంది ఉపాధి వేటకు బయల్దేరారు. గత కొన్నేండ్లుగా దేశంలో నిరుద్యోగరేటు తగ్గుముఖం పడటం లేదు. 2019లో 7.4 శాతం నుంచి 2020కి 25శాతానికి పెరిగింది. అటు తర్వాత 10శాతానికి రాగా, నవంబర్‌లో (నెలవారీ సగటు) 7.5శాతం నమోదైంది. 30 రోజుల సగటు లెక్కలోకి తీసుకుంటే, డిసెంబర్ 1న 8.2శాతం ఉండగా, డిసెంబర్ 16న 9.3శాతం ఉందని నివేదిక గణాంకాలు విడుదల చేసింది. ఇక పట్టణాల్లో నిరుద్యోగరేటు 9.7శాతం దాటుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ 9శాతంపైన్నే ఉంది. డిసెంబర్ 2021లో దేశంలో నిరుద్యోగరేటు 7.9శాతం ఉందని లెక్క తేలింది.