Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మహిళను నరికి చంపిన దుండగులు
రాంచీ : దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్యోదంతాన్ని మరవకముందే అదే తరహాలో మరో దారుణ ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది. సాహెబ్గంజ్ జిల్లా బోరియా పోలీసు స్టేషన్ పరిధిలో రుబికా పహాదిన్ (23) అనే గిరిజన మహిళను దాదాపు 50కి పైగా ముక్కలుగా నరికి హత్య చేశారు. కష్టసుఖాల్లో తోడుగా నిలువాల్సిన భర్తే మరికొందరు దుండగులతో కలిసి ఈ ఉన్మాద చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్త దిల్దార్ అన్సారీ (28) అరెస్టు చేసి మిగిలిన దుండుగుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రుబికా పహాదిన్, దిల్దార్ రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. దిల్దార్కి ఇది రెండో వివాహం. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రలోభానికి గురిచేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో దిల్దార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య తప్పిపోయిందంటూ మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలోని ఒక పాత ఇంటి వద్ద ఛిద్రమైన ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో ఎస్పీ అనురంజన్ కిస్పొట్టా అక్కడికి చేరుకొని పరిశీలించారు. జాగిలాలను రంగంలోకి దించారు. ఆ మృతదేహం రుబికా పహాదిన్గా గుర్తించిన పోలీసులు దిల్దార్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మహిళ శరీరాన్ని ముక్కలుగా చేసేందుకు ఎలక్ట్రిక్ కట్టర్ లాంటి పదునైన ఆయుధాన్ని దుండగులు వాడినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ దారుణ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుండగులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు.