Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలోని బీబీఏయూ యాజమాన్యం హుకుం
- ఏడాదిగా స్కాలర్షిప్లు అందని వైనం
- విడుదల చేయడంలో యోగి సర్కారు జాప్యం
లక్నో : యూపీలోని లక్నోలో గల బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ (బీబీఏయూ) యాజమాన్యం తీరు చర్చనీయాంశంగా మారింది. పెండింగ్ ఫీజులు చెల్లించని విద్యార్థులను పరీక్షలకు నిరాకరిస్తూ వర్సిటీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్సిటీ యాజమాన్యం
తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ తమకు రావాల్సిన స్కాలర్షిప్లను విడుదల చేయలేదనీ, దీంతో తాము ఫీజులు చెల్లించలేకపోయామని చెప్పారు. బీబీఏయూలోని యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (యూఐఈటీ)కు చెందిన విద్యార్థులు వర్సిటీ యాజమాన్యం తీరును నిరసిస్తూ తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
గత, ప్రస్తుత సెమిస్టర్ల ఫీజును చెల్లించని విద్యార్థులు ఈనెల 25 లోగా చెల్లించాలనీ ఒక నోటీసును యాజమాన్యం విడుదల చేసింది. ఫీజు చెల్లించిన వారికే పరీక్షా పత్రాలు నింపడానికి అనుమతిస్తామనీ, జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నది. వర్సిటీ యాజమాన్యం తీరుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విద్యార్థులు తీవ్ర అంసతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. '' మా సెమిస్టర్ పరీక్షలు ఈనెల 12 నుంచి జరుగుతున్నాయి. ఫీజు కట్టనివారిని పరీక్షకు అనుమించలేదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌ల పైనే ఆధారపడతారు. స్కాలర్షిప్ అందుకునేవారంతా ఆర్థికంగా బలహీన నేపథ్యం నుంచి వచ్చినవారేననీ, ఒకవేళ స్కాలర్షిప్లు రాకపోతే వారు (విద్యార్థులు) తమ చదువులను బలవంతంగా ఆపాల్సి వస్తుంది'' అని ఒక కూలీ కొడుకు అయిన వర్సిటీ విద్యార్థిత గౌతమ్ వాపోయాడు. దళితులు విద్యను అభ్యసించటం వర్సిటీ యాజమాన్యానికి ఇష్టం లేదనీ, లేకపోతే వారు మా స్కాలరషిప్ల విషయంలో ఏదో ఒకటి చేసేవారని ఆయన తెలిపాడు. ఈ విషయంలో గతంలో తాము నిరసనలు చేశామని చెప్పాడు. సంబంధిత అధికారులతోనూ మాట్లాడినట్టు వివరించాడు. అయితే, ఫలితం మాత్రం లేదని చెప్పాడు. దళితుల గురించి ఎవరు పట్టించుకుంటారని ఆందోళన వ్యక్తం చేశాడు.
స్కాలర్‌షిప్‌లలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు రాష్ట్ర సాంఘీక సంక్షేమ మంత్రి ఆసిమ్ అర్జున్ను సైతం కలిశారు. స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేస్తామని విద్యార్థులకు ఆయన హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలనీ, అలా అయితేనే తాము ఫీజులు చెల్లించగలమని నిరసన చేస్తున్న విద్యార్థులు యోగి సర్కారును డిమాండ్ చేశారు. ఫీజుల చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యం తమపై ఒత్తిడి చేస్తున్నదంటూ విద్యార్థులు వాపోయారు. ముఖ్యంగా, డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే వర్సిటీ యాజమాన్యం తమకు హాల్ టికెట్లు ఇవ్వదనే భయంతో ఉన్నారు. వర్సిటీలోని లా, సైన్స్, మేనేజ్మెంట్తో పాటు పలు విభాగాల్లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. అయితే, విద్యార్థులకు స్కాలరషిప్లను ఆలస్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎస్ఎప్ఐ బీబీఏయూ యూనిట్ తన ఆందోళనను వ్యక్తం చేసింది. స్కాలర్‌షిప్‌లలో జాప్యం అనేది ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించింది.
కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు మైనారిటీలు, దళితులు, ఆదివాసీలను ఉన్నత విద్యకునోచకోకుండా చేస్తున్నాయని విద్యావేత్తలు ఆరోపించారు. మైనారిటీలకు ఉద్దేశించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్‌ను కేంద్రం ఇటీవల రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రం చూపెట్టిన దారిలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలు నడుస్తున్నాయనడానికి యూపీ సర్కారు ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు.