Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభలో మంత్రి వెల్లడి
- ఏడాదిలో 24,240 పాఠశాలలు మూత
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది మొదలు సంక్షేమ పథకాలపై కన్నేసింది. సబ్సిడీ పథకాలకు ముగింపు పలుకుతోంది. ఒకప్పుడు సామాన్యుడి బ్యాంక్ ఖాతాలో వంటగ్యాస్ సబ్సిడీగా రూ.300 నుంచి 450 వరకు జమయ్యేవి. వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.700లోపు ఉండేది. ఇప్పుడు అదంతా గతం. వంటగ్యాస్ సబ్సిడీని పూర్తిగా కోతలు విధించిన మోడీ సర్కార్, తద్వారా రూ.30,345కోట్లు మిగుల్చుకుంది. ఈ విషయాన్ని సోమవారం రాజ్యసభలో పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. వంటగ్యాస్ సబ్సిడీ ప్రతిఏటా ఎంత తగ్గిస్తూ వస్తోన్న సంగతి తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా సభలో ఆయన పై వివరాలు వెల్లడించారు.
2020-21లో వంట గ్యాస్ సబ్సిడీ రూ.35310 కోట్లు కేటాయించగా, అది 2021-22 నాటికి రూ.4964 కోట్లకు, 2022-23 నాటికి రూ.4865కు తగ్గించింది. దాంతో వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరుగు తున్నాయి. వంటగ్యాస్ సిలిండర్ 2021 ఏప్రిల్ 1 నాటికి రూ.809 ఉంటే, అది 2022 జూలై 6 నాటికి రూ.1,053కి పెరిగింది.
గ్రామీణ ప్రాంతంలో పాఠశాలలు...
ఏడాదిలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 24,240 పాఠశాలలు మూతపడ్డాయని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు. 2020-21లో 12,59,028 పాఠశాలలు ఉంటే, 2021-22 నాటికి 12,34,788 పాఠశాలలకు తగ్గాయని తెలిపారు. విద్యారంగంలో వ్యాపారధోరణల్ని నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ శక్తుల చేతుల్లో అధిక శాతం విద్య, పెరుగుతున్న విద్యా వ్యాపారీకరణకు సంబంధించిన విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియమాలు, సూచనలను ఉల్లంఘించే పాఠశాలలపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు చేపట్టాలన్నారు.
వ్యవసాయ పరికరాలపై 18 శాతం జీఎస్టీ
వ్యవసాయ పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ధాన్యం, ఎండిన పప్పుధాన్యాల, కూరగాయల, పండ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను శుభ్రపరచడం, గ్రేడింగ్ చేయడం, విత్తనాలు చల్లే యంత్రాలపై 18 శాతం జీఎస్టీ విధించామని తెలిపారు. సాగు యంత్రాలపై 12 శాతం విధించినట్లు చెప్పారు.
ఏపిలో 21,575 మంది, తెలంగాణలో 25,904 మంది యువత ఆత్మహత్యలు
ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో 21,575 మంది, తెలంగాణలో 25,904 మంది యువత ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు. దేశంలో మొత్తం 4,56,208 మంది యువత గత మూడేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిరుద్యోగంతో పాటు వివిధ కారణాలతో యువతీ, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు.
14,454 ఎంఎస్ఎంఈలు మూసివేత
ఈ రెండేండ్లలో 14,454 సూక్ష్మ, చిన్న మధ్య పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లు మూతపడ్డాయని కేంద్ర మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. 2021-22లో 6,222 పరిశ్రమలు, 2022-23 (డిసెంబర్ 14 వరకు) 8,232 పరిశ్రమలు మూతపడ్డాయని తెలిపారు.
త్రివిద దళాల్లో 1,35,891 పోస్టులు ఖాళీ
దేశంలోని త్రివిద దళాల్లో 1,35,891 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజరు భట్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇండియన్ ఆర్మీలో 2022 జూలై 1 నాటికి 1,18,485 పోస్టులు, ఇండియన్ నావీలో 2022 సెప్టెంబర్ 30 నాటికి 11,587 పోస్టులు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 2022 నవంబర్ 1 నాటికి 5,819 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్‌పోర్టులు ప్రైవేటీకరణ
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ తెలిపారు. రాజ్యసభలో సిపిఎం ఎంపి ఎలమరం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022-25ల్లో నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపి)లో భాగంగా దేశంలోని 25 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరణ చేస్తామని తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎయిర్‌పోర్టులు మూడు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే ఎనిమిది ఎయిర్‌పోర్టులు ప్రైవేటీకరణ చేశామని అన్నారు.
అప్పుల్లో ఏపీ ఎనిమిదో స్థానం.. 11 స్థానంలో తెలంగాణ
దేశంలోని అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానంలో నిలవగా, తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. సోమవారం లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు జి.రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, మాలోతు కవిత అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ వివరాలు విడుదల చేసింది. 2022 బడ్జెట్ అంచనాల్లో ఏపి అప్పు రూ.3,98,903.6 కోట్లు కాగా, తెలంగాణ అప్పు రూ.3,12,191.3 కోట్లని తెలిపింది. ఏపిలో అప్పు 10.7 శాతం పెరగగా, తెలంగాణ అప్పు 16.7 శాతం పెరిగింది. అప్పుల్లో మొదటి స్థానంలో తమిళనాడు (రూ.6,59,868.9 కోట్లు), రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ (రూ.6,53,307.5 కోట్లు), మూడో స్థానంలో మహారాష్ట్ర (రూ.6,08,999.7 కోట్లు), నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ (రూ.5,62,697.2 కోట్లు), ఐదో స్థానంలో రాజస్థాన్ (రూ.4,77,177.2 కోట్లు), ఆరో స్థానంలో కర్ణాటక (రూ.4,61,832.8 కోట్లు), ఏడో స్థానంలో గుజరాత్ (రూ.4,02,785.4 కోట్లు) నిలిచాయి. అయితే 2021-22 బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పుల పెరుగుదలలో మధ్యప్రదేశ్ (19 శాతం), హర్యానా (18.8 శాతం), అస్సాం (18.7 శాతం), సిక్కిం (18 శాతం), తమిళనాడు (18 శాతం), రాజస్థాన్ (16.8 శాతం), తెలంగాణ (16.7 శాతం), కర్ణాటక (15.1 శాతం), మహారాష్ట్ర (14.8 శాతం), ఛత్తీస్‌గఢ్ (14 శాతం), మిజోరం (13.7 శాతం), త్రిపుర (13.6 శాతం), పశ్చిమ బెంగాల్ (12.1 శాతం), ఉత్తరాఖండ్ (11.6 శాతం), హిమాచల్ ప్రదేశ్ (11.6 శాతం), (11.6 శాతం), ఆంధ్రప్రదేశ్ (10.7 శాతం), గోవా (10.7 శాతం) ఉన్నాయి.
పోలవరం పనుల చెల్లింపుల్లో జాప్యం లేదు
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులకు వెచ్చిస్తున్న సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో సోమవారం వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.15,970 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తంలో ఆమోదయోగ్యమైనవిగా గుర్తించిన బిల్లులకు రూ.13,226 కోట్లు చెల్లింపు జరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పిపిఎ), కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) తనిఖీ చేసి వాటి చెల్లింపుల కోసం సిఫార్సు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని వివరించారు.