Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎంఓపీఎస్ సభలో స్థితప్రజ్ఞ పిలుపు
నవతెలంగాణ - బెంగుళూరు
పాత పెన్షన్ ఇచ్చే రాజకీయ పార్టీలకే ఓటు వేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఫ్రీడమ్‌పార్క్ గ్రౌండ్లో ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల సత్యాగ్రహ భారీ బహిరంగ సభను ఆ సంఘం నాయకులు శాంతారం అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల సాధారణ ఎన్నికలు జరిగిన హిమాచల్ ప్రదేశ్‌లో పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఓట్ ఫర్ ఓపీఎస్ అనే ఉద్యమం ప్రారంభించామని చెప్పారు. అందులో భాగంగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాత పెన్షన్ ఇచ్చే పార్టీకే పట్టం కట్టారని వివరించారు. కర్ణాటకలో ఓట్ ఫర్ ఓపీఎస్ కొనసాగించే పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల ఓట్లు వేయాలంటూ తీర్మానించామని చెప్పారు. కర్ణాటకలో 4.4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతోపాటు వారి కుటుంబాల ఓట్లు దాదాపు 30 లక్షల వరకు ఉంటాయన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసిన తొలి రాష్ట్రంగా కర్ణాటక కావాలని డిమాండ్ చేశారు. సభకు హాజరైన వారితో పాత పెన్షన్ ఇచ్చే పార్టీలకే ఓటు వేయాలనే ప్రతిజ్ఞ చేయించారు. ఎన్ ఎంఓపీఎస్ ఏర్పడిన ఐదేండ్లలోనే ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో పాత పెన్షన్ సాధించి పెట్టిందన్నారు. సిక్కిం రాష్ట్రంలో ఇటీవల పాత పెన్షన్ సాధనకు కమిటీ వేశారని గుర్తు చేశారు. సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రాలకు వచ్చే పెన్షన్ నిధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత సుపరిపాలన అందించొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు (ఆంధ్రప్రదేశ్), విజయకుమార్ బందు (ఉత్తరప్రదేశ్), జిత్మని మైలు (ఉత్తరాఖండ్), తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్, దర్శన్ గౌడ్, బాలస్వామి, చంద్రకాంత్, తాహరాలి, నాగరాజ్ రఘువర్మ తదితరులు పాల్గొన్నారు.