Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల హక్కులు కాలరాస్తే సహించం : సిహెచ్ నర్సింగరావు
- 'అనంత'లో ప్రారంభమైన ఎపి మున్సిపల్ వర్కర్స్ మహాసభ
- మొదటి రోజు భారీ ప్రదర్శన, బహిరంగ సభ
అనంతపురం: కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి కలసి ఆంధ్రప్రదేశ్‌ను 'అదాని ప్రదేశ్'గా మారుస్తున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు విమర్శించారు. బ్రిటీష్ కాలంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కూడా ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 14వ రాష్ట్ర మహాసభ అనంతపురం నగరంలో మంగళవారం ప్రారంభమైంది. మొదటి రోజు మహా ప్రదర్శన, బహిరంగ సభ జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షతన నగర పాలక సంస్థ కార్యాలయం కూడలి వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరైన సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన నీళ్ల జల్లుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారి సమస్యల పరిష్కారానికి మాత్రం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేవీ లేవని తెలిపారు. సమానపనికి సమాన వేతనం ఇస్తామని, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వైసిపి ఈ హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను అదానికీ కారు చౌకగా కట్టబెడుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోక్సో, ఆదానీలకు అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికలకు ముందు వైసిపి ఇచ్చిన హామీని గద్దెనెక్కాక విమర్శించడం తగదన్నారు. ఉద్యోగులకు వర్తించే రిటైర్డుమెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు పారిశుధ్య కార్మికులకు వర్తించడం లేదని తెలిపారు. కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. ఆ సమయంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఇస్తామన్న రూ.50 లక్షలు పరిహారం నేటికీ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి మాట్లాడుతూ అధికారంలో ఉన్న పాలకులకు కార్మికుల సమస్యలు పట్టడం లేదని విమర్శించారు. వారి సమస్యలు వినిపించేందుకు కార్మిక సంఘాలకు కనీసం సమయం కూడా ఇవ్వకపోవడం తగదన్నారు. సిఐటియ రాష్ట్ర నాయకులు ఓబుళుతదితరులు ప్రసంగించారు. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.