Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళన
- రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్
- లోక్‌సభ అరగంట సేపు వాయిదా
- ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
- శుక్రవారంతో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!
న్యూఢిల్లీ : జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజ్యసభలో ఎన్హెచ్ఆర్సీ దుర్వినియోగాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్‌సభ అరగంట సేపు వాయిదా పడింది. బీహార్, పశ్చిమబెంగాల్‌తో సహా ఇతర ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన జరిగినా ఆఘమేఘాలపై స్పందిస్తూ బృందాలను పంపుతున్న ఎన్హెచ్ఆర్సీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్నాటక వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెద్ద ఘటనలు జరిగినా స్పందించటం లేదని, ఆయా రాష్ట్రాలకు బృందాలను పంపటంలేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. దీనిపై చర్చకు రాజ్యసభలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా నోటీసులిచ్చారు. అయితే చైర్మెన్ జగదీప్ ధన్ఖర్ నోటీసులను అనుమతించలేదు. దీంతో ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. లోక్‌సభలో ఆర్జేడీ పక్షనేత రాజీవ్ రంజన్ సింగ్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. గుజరాత్లో దాదాపు 150 మంది చనిపోయినా ఎన్హెచ్ఆర్సీ అక్కడికి బృందాన్ని పంపలేదనీ, కానీ బీహార్‌కు మాత్రం పంపిందని విమర్శించారు. ఇది పూర్తిగా ఎన్హెచ్ఆర్సీ దుర్వినియోగమేనని విమర్శించారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ బిల్లు
బహుళ-రాష్ట్ర సహకార సంఘాలపై చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు సంయుక్త కమిటీకి మంగళవారం పంపారు. హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా, 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఈ పార్లమెంటరీ జాయింట్ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ బిల్లును లోక్‌సభలో డిసెంబర్ 7న ప్రవేశపెట్టారు. దీనిని సమీక్ష కోసం స్టాండింగ్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ, ప్రతిపక్షం మధ్య వాగ్వాదం
రాజస్థాన్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ దేశం కోసం నిలబడిందనీ, కాంగ్రెస్ నాయకులు అత్యున్నత త్యాగాలు చేశారనీ, అది స్వాతంత్య్ర సాధించడంలో సహాయపడిందని తెలిపారు. కానీ దేశం కోసం 'బీజేపీ కుక్కను కూడా కోల్పోలేదు' అని అన్నారు. దీనిపై ఉభయసభల్లో బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
లోక్‌సభలో బీజేపీ, ప్రతిపక్ష సభ్యుల పరస్పర వాగ్వివాదాల మధ్య అరగంట సేపు వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే అధికార బీజేపీ ఎంపీలు ఖర్గే చేసిన వ్యాఖ్యల అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కూడా నిరసన ప్రారంభించారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏడు నిమిషాలకే సభను అరగంట పాటు వాయిదా వేశారు. రాజ్యసభలో సభా నాయకుడు పియూష్ గోయల్, ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని, అల్వార్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించారని పియూష్ గోయల్ అన్నారు. దానికి ఖర్గే స్పందిస్తూ క్షమాపణలు చెప్పేదే లేదని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర లేదన్న తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదిలేదన్నారు.
శుక్రవారంతో ముగియనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..!
ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే వారం ముందుగా డిసెంబర్ 23 శుక్రవారంతో ముగిసే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ రెండింటి షెడ్యూల్‌ను నిర్వహించే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలోనిబిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం సంబంధిత వర్గాలు తెలిపాయి.