Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్
న్యూఢిల్లీ : గత ఆరేండ్లలో బ్యాంకులు రూ. 11.17 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీ చేశాయని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ''ఆర్బీఐ డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు), షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు (ఎస్సీబీలు) గత ఆరేళ్లలో వరుసగా రూ. 8,16,421 కోట్లు, రూ.11,17,883 కోట్ల మొత్తాన్ని రద్దు చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 1 కోటి కంటే ఎక్కువ డిఫాల్ట్ చేసిన రైట్-ఆఫ్‌లు/డిఫాల్టర్ల పేర్లతో సహా జాబితాకు సంబంధించి, రైట్ ఆఫ్ లోన్ ఖాతాలపై రుణగ్రహీతల సమాచారం దాని ద్వారా నిర్వహించబడదని ఆర్బీఐ తెలియజేసింది'' అని అన్నారు.
టాప్ 10 కంపెనీలకు మొత్తం రూ.5,32,430 కోట్ల రుణం
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు టాప్ 10 కంపెనీలకు రూ.5,32,430 కోట్ల రుణం ఇచ్చాయని కేంద్ర మంత్రి భగవత్ కరద్ తెలిపారు. 2022 మార్చి 31 వరకు దేశంలోని టాప్ 10 కంపెనీలకు రూ.61,874 కోట్లు రుణాలు మాఫీ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల్లో 4.29 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు తగ్గుదల
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 4.29 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు తగ్గారని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరద్ తెలిపారు. మరోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరిగారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీఎస్ఈ)ల్లో 2014 మార్చి 31 నాటికి 13.51 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 9.22 లక్షల మంది ఉద్యోగులకు తగ్గారు. ఎనిమిదేండ్లలో 4.29 లక్షల మంది ఉద్యోగులు తగ్గారు. 2014 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో 3.08 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే, 2022 మార్చి 31 నాటికి 4.99 లక్షలకు పెరిగారు. అంటే 1.91 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరిగారు. 4.29 లక్షల శాశ్వత ఉద్యోగాలు తగ్గి, 1.91 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగాయి.
రాష్ట్రాలకు రూ.17,176 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారం ఈ ఏడాది జూన్ నాటికి రూ.17,176.4257 పెండింగ్‌లో ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.689.2055 కోట్లు, తెలంగాణకు రూ.547.9005 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు.
ఉపాధి హామీ నిధులు రూ.10,162 కోట్లు పెండింగ్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.10,162 కోట్లు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్వోతి తెలిపారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డిసెంబర్ 12 వరకు దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.5,450 కోట్లు, వేతనాలకు సంబంధించి రూ.4,712 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఏపీకి మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.697 కోట్లు, వేతనాలకు సంబంధించి నిధులు రూ.31 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రూ.182 కోట్లు, వేతనాలకు సంబంధించి నిధులు రూ.50 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.