Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లోనే అతి ఎక్కువ
- ఇలాగైతే వృద్థి కష్టమే
- మారుతి సుజుకి ఛైర్మెన్ భార్గవ ఆందోళన
న్యూఢిల్లీ : భారత్‌లో వాహనాలపై పన్ను రేట్లు భరించలేని స్థాయిలో ఉన్నాయని దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి చైర్మెన్ ఆర్సి భార్గవ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్‌లోనే వాహనాలపై అత్యధికంగా పన్నులు ఉన్నాయని వెల్లడించారు. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే వృద్థి కష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేస్తూ.. వాహన రంగానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. కార్ల పరిమాణాన్ని బట్టి ఇక్కడ వేర్వేరు పన్నులు వేస్తున్నారని తెలిపారు. వాటిని కనీస స్థాయికి హేతుబద్ధీకరించాలని సూచించారు. అధిక పన్నులతో వాహన పరిశ్రమ పురోగతి సాధించలేదన్నారు. ఈ అంశాన్ని పూర్తిగా పాలకులు, రాజకీయ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జిఎస్టితో పాటు వాహన రకాన్ని బట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు అదనపు సెస్సును విధిస్తున్నారు. పూర్తిగా తయారు చేసిన యూనిట్లుగా దిగుమతి చేసుకున్న కార్లపై ఇంజిన్ పరిమాణం, ధర, బీమా, రవాణా తదితర అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని 60 శాతం నుంచి 100 శాతం మధ్య కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నారు. అన్ని రకాల విద్యుత్ వాహనాలపై మాత్రం ఎలాంటి తేడా లేకుండా 5 శాతం జిఎస్టి అమల్లో ఉంది. ''పెద్ద కార్లతో పోలిస్తే చిన్న కార్లపైనే నియంత్రణ, నిబంధనలు ఎక్కువగా ఉన్నాయి. చిన్న కార్ల కొనుగోళ్లు ఇది వరకు స్థాయిలో జరగడం లేదు. అందుకే దేశంలో పెద్ద కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ పరిశ్రమ స్థిర అభివృద్థిని సాధించాలంటే కొనుగోలుదారులు పెరగాలి. భారత తయారీ రంగం వేగంగా వృద్థిని సాధిస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. ప్రధాని మోడీ నేతత్వంలోని ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్నప్పటికీ అంతగా ఫలితాలు రావడం లేదు. వాహన పరిశ్రమలో ఆరోగ్యకరమైన వద్ధి నమోదు కావాల్సిన అవసరం ఉంది.'' అని భార్గవ తెలిపారు. ''ఈ నెల 18న జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యువి)లకు అన్ని రాష్ట్రాల్లో ఒకే నిర్వచనం ఇవ్వాలని నిర్ణయించింది. 1500సిసికి పైగా సామర్థ్యం గల ఇంజిన్, 4000 మిమీ పొడవు, 170మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ గల అన్ని కార్లకు 28 శాతం జిఎస్టి, 22 శాతం సెస్ వర్తిస్తుంది. దీని ప్రకారం మొత్తం పన్నులు 50 శాతానికి చేరుకుంటాయి. 50 శాతం పన్నుల వ్యవస్థతో భారత్ వాహన పరిశ్రమ వృద్థిని సాధించలేదు.'' అని భార్గవ పేర్కొన్నారు.