Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌లో రైతుల ఆందోళన
- పోలీసుల లాఠీచార్జి, పలువురు అరెస్టు
ఫిరోజ్‌పూర్ : పంజాబ్‌లో మద్యం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు, గ్రామస్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. అనేకమందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా జిరా అసెంబ్లీ నియోజకవర్గంలోని మన్సూర్వాల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడి మాల్బ్రోస్ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మద్యం తయారీ యూనిట్‌కు వ్యతిరేకంగా కొన్ని నెలల నుంచి ఆందోళన జరుగుతోంది. ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలనే డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారు. ఈ మద్యం ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల నివాసస్థలాలతో పాటు, పంట భూములు కూడా నాశనమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. భూగర్భ జలాలు కలుషితం కావడం, పంటలు సరిగ్గా పండకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ నష్టం, వాయు కాలుష్యం బాగా వుందన్నారు. ఈ మద్యం ఫ్యాక్టరీని జులై 24న ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా సంజా జిరా మోర్చా బ్యానర్ కింద నిరసనలు జరుగుతుండటంతో 146 రోజుల పాటు ఫ్యాక్టరీని మూసివేశారు. దాంతో ఫ్యాక్టరీ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. యాజమాన్యానికి అనుకూలంగా పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుత ధర్నా ప్రాంతాన్ని ఫ్యాక్టరీ నుంచి 300 మీటర్ల దూరానికి తరలించాలని, రూ.20 కోట్ల జరిమానా కట్టాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఫ్యాక్టరీని తాజాగా మళ్లీ తెరవడానికి రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ధర్నాను ముగించాలని వ్యవసాయ మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఆ ప్రాంతానికి ఆదివారం వచ్చి ఆందోళనకారులను కోరగా, వారు తిరస్కరించారు. సోమవారం నుంచి ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు.