Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పీఎస్యూల్లో ఎంపిక చేయటం లేదు..
- కేంద్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు : పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్యూ) ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వట్లేదని పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ప్రభుత్వ రంగ సంస్థల యూనిట్స్లలో సీనియర్, బోర్డ్ స్థాయి ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరైనా, ఈ సామాజిక వర్గాల నుంచి ఎవర్నీ ఎంపికచేయట్లేదని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది. బీజేపీ ఎంపీ కిరీటి సోలంకి నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. బోర్డ్, మేనేజ్మేంట్ స్థాయి పోస్టుల నియామకాల్లో ఇప్పుడున్న విధానాన్ని సమీక్షించాలని కమిటీ ఎన్నోమార్లు కోరినా కేంద్రం పట్టించుకోవటం లేదని, సీరియస్గా తీసుకోవటం లేదని కమిటీ విమర్శించింది. ప్రమోషన్లకు విషయంలో ప్రస్తుత నిబంధనల్లో మార్పుల్ని ప్రతిపాదిస్తూ కేంద్ర మంత్రివర్గానికి సంబంధిత విభాగాలు ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ''కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటిలోనూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నియామకాల వివరాలు సమర్పించాలని సంబంధిత అధికారుల్ని కోరాం. సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది. అయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పీఎస్యూలలోని బోర్డ్, సీనియర్ స్థాయి నియామకాల్లో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం రిజర్వేషన్ల ప్రకారం లేదు. దీనిని సరిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన్నే ఉంది'' అని కమిటీ పేర్కొన్నది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎంతమంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు? వీరిని ఎందుకు ఎంపికచేయలేదన్న వివరాల్ని ఇవ్వాలని సంబంధిత ఉన్నతాధికారుల్ని కమిటీ కోరింది. ఒక అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకులో ప్రమోషన్లకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులున్నా, వారిని ఎంపికచేయలేదని తెలిపింది. వృత్తిలో వారి గత రికార్డులు బాగున్నా, ప్రమోషన్లు ఎందుకు నిరాకరించారో తెలపాలని ఆదేశించింది. ప్రభుత్వ బ్యాంకుల బోర్డ్ డైరెక్టర్స్గా ఎస్సీ, ఎస్టీలను ఎందుకు నియమించటం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోనూ ఆఫీసర్ స్థాయి పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలెవరూ లేదని, పీఎస్యూల్లోనూ ఇదే పరిస్థితి ఉందని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.