Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ ఇంకా ముగియలేదు..
- అధికారులకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు
- ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచన
- అప్రమత్తమైన పలు రాష్ట్రాలు
- కరోనాపై సమీక్షా సమావేశాలు.. కొత్త మార్గదర్శకాలతో ముందుకు
న్యూఢిల్లీ : ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా మళ్లీ కోరలు చాస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ప్రధాని మోడీ భేటీ కొనసాగింది. ముందుగా కోవిడ్‌పై ప్రధానికి ఆరోగ్య శాఖ వివరణాత్మక బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సన్నాహాలను ప్రధాన మంత్రి ప్రశ్నించారు. అనంతరం అధికారులకు ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు.
కోవిడ్ వ్యాప్తిపై గట్టి నిఘా ఉంచాలని ప్రధాని సూచించారు. కోవిడ్ ఇంకా ముగియలేదని ప్రధాని మోడీ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాలపై మరింత నిఘా ఉంచాలని సూచించారు. జీనోమ్ సీక్వెన్సింగ్, టెస్టింగ్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఆస్పత్రులను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. మాస్క్‌లు ధరించడంతోపాటు, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండుగల సీజన్ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
దీంతోపాటు.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ఫ్రంట్‌లైన్ కార్మికులు, కరోనా యోధుల నిస్వార్థ సేవను ప్రధాన మంత్రి మోడీ మరోసారి ప్రశంసించారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, సిబ్బందితో సహా ఆస్పత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను నిర్ధారించడానికి కోవిడ్‌కు సంబంధించిన అవసరమైన సౌకర్యాలను ఆడిట్ చేయాలని రాష్ట్రాలను పీఎం మోడీ కోరారు. అవసరమైన ఔషధాల లభ్యత, ధరలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందని సూచించారు. సరిపడా మందులు, వ్యాక్సిన్లు, హాస్పిటల్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఈ హైలెవల్ మీటింగ్‌లో ప్రధానికి అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ సమావేశంలో హౌం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన వద్దు..అప్రమత్తంగా ఉందాం..
- కరోనా పరిస్థితులపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉన్నత స్థాయి సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా పట్ల ఆందోళన అవసరం లేదనీ, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే తీసుకోవాలనీ, బూస్టర్ డోసు వేసుకోవాలని సూచించారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కోవిడ్ సన్నద్ధతపై మంత్రి గురువారం ఉన్నత స్థాయి సమీక్ష జూమ్ ద్వారా నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండి చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజరు కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఆరోగ్య శాఖ కోవిడ్ సన్నద్ధతపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు సర్వం సంసిద్ధంగా ఉందనీ, ప్రజలు ఎటువంటి భయాందోనళకు గురి కావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి మన వద్ద లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. మానవ వనరులు , మందులు , ఆక్సిజన్ , ఐసీయూ పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలనీ, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.