Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారాల ఆనంద్‌కు అనువాద పురస్కారం
- 23 భాషలకు,17 పుస్తకాలకు అవార్డులు
- ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ
న్యూఢిల్లీ : తెలుగు రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన మనోధర్మపరాగం నవలకు సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. అలాగే రచయిత, కవి వారాల ఆనంద్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. ప్రముఖ రచయిత గుల్జార్ హిందీలో రాసిన గ్రీన్ పోయెమ్స్ (కవిత)ను తెలుగులోకి 'ఆకుపచ్చ' కవితల పుస్తకానికిగాను వారాల ఆనంద్‌కు ఈ పురస్కారం లభించింది. గురువారం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అనంతరం 2022 ఏడాది సంబంధించి 23 భాషలకు అవార్డులను, 17 పుస్తకాలకు అనువాద పురస్కారాలను ప్రకటించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు సంబంధించి ఏడు కవిత్వం, ఆరు నవల, రెండు లఘు కథలు, మూడు ప్లే డ్రామా, రెండు సాహిత్య విమర్శ, ఒక ఆత్మకథ రచన, ఒక ఆర్టికల్స్ సేకరణ, ఒక సాహిత్య చరిత్రకు సంబంధించిన పుస్తకాలు సాహిత్య అకాడమీ అవార్డు లు గెలుచుకున్నాయని తెలిపింది. 2016 జనవరి 1నుంచి 2020 డిసెంబర్ 31 ఐదేండ్లలో రాసిన పుస్తకాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదు, రాగి షీల్డ్ అందజే యనున్నట్టు వెల్లడించింది. బెంగాలీ భాషకు సంబం ధించి త్వరలోనే ప్రకటిస్తామని సాహిత్య అకాడమీ పేర్కొంది. తెలుగు భాషకు జ్యూరీ సభ్యులుగా సిఎల్‌ఎల్ జయప్రద, నందిని సిద్థారెడ్డి, పి. కుసుమ కుమారి వ్యవహరించారు. అనువాద పురస్కారానికి సంబంధించి 17 పుస్తకాలను ఎంపిక చేసింది.
మనోధర్మపరాగం నవలా నేపథ్యం
మనోధర్మపరాగం నవలను వ్యక్తుల చరిత్రల్ని, సామాజిక చరిత్రని మిళితం చేస్తూ రచయిత మధురాంతకం నరేంద్ర రాశారు. దాదాపు ఒక శతాబ్దన్నర కాలాన్ని, ఆ కాలంలో ఉన్న దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, ఇంగ్లీషు వాళ్ళు వచ్చిన తరువాత దేవదాసీల ఈనాం భూములు రద్దు చేయటంవల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు, ఆ మార్పుల ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం, నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులు అన్నీ ఈ నవలలో పేర్కొన్నారు.
మధురాంతకం నరేంద్ర జీవిత నేపథ్యం
మధురాంతకం నరేంద్ర చిత్తూరు జిల్లా పాకాల మండలం, రమణయ్యగారి పల్లెలో 1959 జూలై 16న జన్మించారు. ఆయన తండ్రి మధురాంతకం రాజారాం అదే ఊళ్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. నరేంద్రకు సాహితీ రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2014లో మల్లెమాల సాహితీ పురస్కారంతో మరో 11 రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి.
ఆకుపచ్చ కవితల నేపథ్యం
గుల్జార్ గ్రీన్ పోయెమ్స్‌ని పవన్ కె వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో తెలుగులోకి ద్విభాషాకవి, జర్నలిస్టు వారాల ఆనంద్ అనువదించారు. ఇందులోని 58 కవితలన్నీ ప్రకృతికి సంబంధించినవే. మనిషి, ప్రకృతి మధ్య అనుబంధాన్ని ఎంతో సూటిగా, సున్నితంగా, సరళంగా చెప్పిన కవితలు.
వారాల ఆనంద్ జీవిత నేపథ్యం
వారాల ఆనంద్ వేములవాడలో 1958 ఆగస్టు 21న జన్మించారు. డిగ్రీ వరకు విధ్యాభ్యాసం కరీంనగర్లో జరిగింది. పి.జి. తెలుగు, తత్వశాస్త్రం, లైబ్రరీ సైన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. లైబ్రేరియన్‌గా 1980-2016 వరకు పలు జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పని చేశారు. అదే విధంగా ఎస్ఆర్ఆర్ కాలేజీలో గ్రంధాలయ భవన్ నిర్మాణం, రెండు జాతీయ సెమినార్ల నిర్వహణ, రెండు మైనర్ రిసర్చ్ ప్రాజెక్టుల నిర్వహణ, నేషనల్ బుక్ ట్రస్ట్ సహకారంతో బుక్ ఫెస్టివల్స్ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంద్ కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కౌన్సిల్ సభ్యుడుగా ఉన్నారు.