Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెస్పీ పెంచట్లేదని కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ : పత్తి రైతుకు కేంద్రం మొండిచేయి చూపింది. ఇప్పట్లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచే ఆలోచన లేదని తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తిని పరిశీలించి...దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్ర వస్త్ర పరిశ్రమ శాఖ విభాగంలోని ఉన్నతాధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. పత్తి కనీస మద్దతు ధర పెంచాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి విన్నవించాయి. ఇన్పుట్ వ్యయం భారీగా పెరిగిందని, నాణ్యతలేని విత్తనాల వల్ల నష్టపోయామని, చీడపురుగుల దెబ్బకు దిగుబడి పడిపోయిందని పత్తి రైతు ఆవేదన చెందుతున్నాడు. దీంతో ఆయా రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర పెంచాలని పత్తి రైతుల నుంచి డిమాండ్ తీవ్రమవుతోంది. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రాబోతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇంతలో కేంద్రం వారికి పిడుగులాంటి వార్త వినిపించింది. పత్తికి ఎమ్మెస్పీ పెంచే ఆలోచనలేదని, ఒకవేళ దేశీయంగా మార్కెట్లో ధరలు పడిపోతే అప్పుడు ఆలోచిస్తామని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రయివేటు ట్రేడర్స్ ఎమ్మెస్పీ ధర వద్ద పత్తిని కొనుగోలు చేయకపోతే, సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు ప్రారంభిస్తుం దన్నారు. మధ్యరకం గ్రేడ్ పత్తికి కేంద్రం రూ.6080 ఎమ్మెస్పీగా నిర్ణయించింది. ఇన్పుట్ వ్యయం, విత్తనాలు, ఎరువులకు అయిన ఖర్చులు చూసుకుంటే, ఇప్పుడున్న ఎమ్మెస్పీతో తమకు దక్కేది ఏముండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ''కాయతొలుచు పురుగు పంటను దారుణంగా దెబ్బకొట్టింది. గత నాలుగేండ్లుగా అనేక సమస్యలు రైతుల్ని వేధిస్తున్నాయి. దాంతో క్రమంగా పంటసాగును తగ్గిస్తూ వస్తున్నా. పత్తి క్వింటాల్‌కు ఎమ్మెస్పీ రూ.10వేల పైన్నే ఉండాలి. అలాంటిది రూ.6వేల వద్ద ఉంది'' అని రాజ్‌కోట్‌కు చెందిన ఓ రైతు వాపోయాడు. నాణ్యత లేని విత్తనాల్ని కంపెనీలు తమకు అంటగడుతున్నాయని, దాంతో ఎకరాకు కనీసం మూడు క్వింటాల్ పత్తి కూడా రావటం లేదని పంజాబ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాయతొలుచు పురుగు మహారాష్ట్రలోనూ పత్తి రైతుల్ని తీవ్రంగా నష్టపర్చిందని రైతు సంఘాలు తెలిపాయి. విత్తనాలు, పత్తి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటంపై నిషేధిస్తే దేశీయంగానూ కొనుగోళ్లు బాగుంటాయని, మంచి ధర లభిస్తుందని రైతు సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.