Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్‌కు టీఆర్ఎస్ ఎంపీల వినతి
న్యూఢిల్లీ : పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్లను టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్రావు, సంతోష్, సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బిబి పాటిల్ కలిశారు. ఈ సందర్భంగా పార్టీ పేరు మార్పుపై కేసీఆర్ పంపిన లేఖను అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తన నివాసంలో ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మెన్ పార్టీ పేరు మార్చాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇకపై తెలంగాణ మోడల్ నే తమ పాలసీ అని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం ప్రధాన ఎజెండాగా ఉంటుందన్నారు. అయితే, బీఆర్ఎస్ కార్యాచరణ కొన్ని రోజుల్లో తెలుస్తుందనీ, పార్టీ అధ్యక్షుడు కె.చంద్ర శేఖర్ రావు అన్ని వివరాలు వెల్లడిస్తా రన్నారు. తెలంగాణకు ఎనిమిదేండ్లుగా కేంద్రం అడుగడుగునా ఆటంకాలు కల్పిం చిందని నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని కల్లాలకు ఉపయోగిస్తే కేంద్రం అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఉందని ఆరోపించారు. గతంలో తాగేందుకు నీళ్లు లేక ఊర్లను వదిలిస్తే, ఇప్పుడు తాగు, సాగు నీరుతో తెలంగాణ పచ్చ పడిందన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదని విమర్శించారు. బల్క్ డిగ్ పార్క్ విషయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ పెద్ద అబద్ధం ఆడారని అన్నారు.
ఆరు రాష్ట్రాల్లో గ్రామ కమిటీలు
భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్
ఆరు రాష్ట్రాల్లో గ్రామ కమిటీలు వేస్తామని భారత రాష్ట్ర కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ తెలిపారు. శుక్రవారం నాడిక్కడ బీ ఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో రైతులే నేతలని పేర్కొన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులకు అనుకూలంగా ఏ నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు. పంట భూములు, రైళ్లు, పోర్టులు అన్నీ అమ్మేశారని ఆరోపించారు. కాని తెలంగాణ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు, పేదలకు అండగా నిలిచి రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి అందజేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, మొదటగా హర్యానా,పంజాబ్, బీహార్, కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర పై దృష్టి పెట్టామని తెలిపారు.