Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మంది సైనికులు మృతి
గ్యాంగ్టక్ : సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం లోయలో పడటంతో 16 మంది సైనికులు మరణించారు. ఉత్తర సిక్కింలోని జెమాలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. చాట్టెన్ నుంచి థంగ్కు మూడు వాహనాలతో సైనికుల కాన్వాయి వెళుతోంది. ఇరుకైన కొండదారిలో వాహనం మలుపు తిరిగే సమయంలో ఓ వాహనం అదుపుతప్పి లోయలోకి జారిపడినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమిషనర్ అధికారులు సహా 16 మంది మరణించారు. తీవ్రగాయాలైన మరో నలుగురు సైనికులను హెలికాఫ్టర్లో ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రపతి దిగ్భ్రాంతి..
రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబా లకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఆమె ట్వీట్ చేశారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హౌంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు సాధ్యమైనంత మేరకు అవసరమైన వైద్య సాయం అందిస్తామని.. వారు త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నట్టు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు.
బాధాకరం : మోడీ
వీర జవాన్ల మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 'సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మన వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని పీఎంవో ట్విటర్లో పేర్కొన్నారు.
వారి సేవలకు దేశం రుణపడి ఉంటుంది.. : రాజ్నాథ్
ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైనికులు మృతిచెందిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారు అందించిన సేవలు, నిబద్ధతకు ఈ దేశం రుణపడి ఉంటుందన్నారు.