Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షెడ్యూల్‌కు వారం రోజుల ముందే సమాప్తం
- లోక్‌సభలో 7, రాజ్యసభలో 9 బిల్లులు ఆమోదం
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. డిసెంబర్ 7న ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో సమాప్తమయ్యాయి. వాస్తవానికి డిసెంబర్ 7 నుంచి 29 వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా, షెడ్యూల్‌కు వారం రోజుల ముందే ముగించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 17 రోజులు, 13 సిట్టింగ్‌లు జరిగాయి. లోక్‌సభలో ఏడు, రాజ్యసభలో తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయ సభల్లో తొమ్మిది కొత్త బిల్లులు ప్రవేశపెట్టగా, తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. లోక్‌సభల 97 శాతం, రాజ్యసభ 103 శాతం ఉత్పాదకత నమోదు చేసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, వి. మురళీధరన్‌లతో కలిసి మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పార్లమెంట్ ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)ల సిఫార్సుల మేరకు పార్లమెంట్ సమావేశాలు కుదించామని తెలిపారు. మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లులను పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపామని పేర్కొన్నారు. రూల్ నెంబర్ 193 కింద రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. దేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్య, ప్రభుత్వం తీసుకున్న చర్యలు, దేశంలో క్రీడలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 15 గంటలకు పైగా జరిగిన ఈ రెండు చర్చల్లో 119 మంది వివిధ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. రూల్ 176 కింద ఒక అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. గ్లోబల్ వార్మింగ్ తీవ్రమైన ప్రభావాలు, దానిని పరిష్కరించడానికి నివారణ చర్యల ఆవశ్యకత అంశంపై జరిగిన చర్చలో వివిధ పార్టీలకు చెందిన 17 ఎంపిలు పాల్గొన్నారు. మూడు గంటల పాటు ఈ చర్చ జరిగింది.
ఉభయ సభల్లో ఆమోదించిన బిల్లులు
వన్యప్రాణుల (రక్షణ) బిల్లు,ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లు ,న్యూఢిల్లీ ఆర్బిట్రేషన్ సెంటర్ (సవరణ) బిల్లు ,రాజ్యాంగ (ఎస్సీ, ఎస్టీ) ఉత్తర్వు (రెండో సవరణ) బిల్లు,మారిటైమ్ యాంటీ పైరసీ బిల్లు,రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వు (రెండో సవరణ) బిల్లు, రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వు (నాలుగో సవరణ) బిల్లు, ద్రవ్య వినిమయ (నెంబర్ 4) బిల్లు , ద్రవ్య వినిమయ (నెంబర్ 5) బిల్లు.