Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో వామపక్ష ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : విద్యుత్ ప్రయివేటీకరణ ఆపాలని వామపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. విద్యుత్ రంగాన్ని కూడా ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. 'విద్యుత్ ప్రయివేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలి. విద్యుత్ ప్రజల హక్కు. ప్రయివేటీకరణ ఆపాలి' అంటూ ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం మాట్లాడుతూ రాష్ట్రాలను సంప్రదించకుండా విద్యుత్ సవరణ బిల్లును సభలోకి తీసుకురావడం దారుణమన్నారు. ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందనీ, రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలతో చర్చించకుండా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడితే, ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని విమర్శించారు. విద్యుత్ రంగ ప్రయివేటీకరణతో రైతులు, పేదలకు ఇచ్చే సబ్సిడీల్లో కోత పెడతారని విమర్శించారు. కోట్లాది మంది రైతులు సబ్సిడీపై ఆధారపడుతున్నారనీ, దాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు పిఆర్ నటరాజన్, బికాష్ రంజన్ భట్టాచార్య, వి.శివదాసన్, జాన్ బ్రిట్టాస్, ఎఎ రహీమ్, ఎఎం ఆరీఫ్, సీపీఐ ఎంపీలు కె.సుబ్బరాయన్, పి.సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.