Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ఎన్నికలకు ముందే కొత్త వేరియంట్ గుర్తింపు
- రెండు కేసులూ ఆ రాష్ట్రం నుండే..!
- అప్పుడు విడుదలకాని మార్గదర్శకాలు
- ఎన్నికల ప్రచారంలో ప్రధాని బిజీ
- ఇప్పుడు కేంద్ర సర్కారు హడావుడి
- ప్రభుత్వ తీరుపై వైద్య, ఆరోగ్య నిపుణుల ఆందోళన
భారత్‌లో కరోనా విషయంలో మోడీ సర్కారు రాజకీయాలు చేస్తున్నదా? ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమనుకుంటున్నదా? వేగంగా విస్తరిస్తున్నదని చెప్పబడుతున్న ఒమిక్రాన్ కొత్త ఉప వేరియంట్ బీఎఫ్.7 విషయంలో కేంద్రం కావాలనే హడావుడి చేస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. వాస్తవానికి భారత్‌లో ఈ బీఎఫ్.7 రకం ఒమిక్రాన్ ఉప వేరియంట్ అనేది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందే దేశంలో బయటపడింది. జూన్, సెప్టెంబర్ మాసాల్లో గుర్తించబడిన ఆ రెండు కేసులూ గుజరాత్ నుంచే బయటపడటం గమనార్హం. అయితే, ఆ సమయంలో కేంద్రం మాత్రం దీనిని అంత సీరియస్‌గా తీసుకోలేదు.
న్యూఢిల్లీ : బీఎఫ్.7 బయటపడిన సమయంలో గుజరాత్లో బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగమైంది. మోడీ, అమిత్ షా మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రతి ఒక్కరూ తమ ఎన్నికల ప్రచారాన్ని హౌరెత్తించారు. కేంద్రంలో పాలనను పక్కకు పెట్టి మరీ మోడీ రంగంలోకి దిగి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. సుడిగాలి పర్యటనలు చేశారు. సమావేశాలు నిర్వహించారు. రోడ్ షోలు, ర్యాలీలు జరిపారు. ఆ తర్వాత గుజరాత్ ఎన్నికలు ముగియడం.. ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం కూడా అక్కడ కొలువు తీరింది.
అయితే, దాదాపు మూడు, నాలుగు నెలల కింద బయటపడిన బీఎఫ్.7 వేరియంట్ విషయంలో కేంద్రం మాత్రం ఇప్పుడు మేల్కొన్నది. దీనిపై ఇటీవలనే ఉన్నతస్థాయి సమావేశాలను నిర్వహించటం గమనార్హం. తొలుత ఈనెల21న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో కరోనాపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కరోనా ఇంకా ముగియలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆ సమావేశం అనంతరం ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత కోవిడ్‌పై ప్రధాన మోడీ సమీక్షా సమావేశం.. రాష్ట్రాలను అప్రమత్తం చేయడం.. దానికి తోడు మీడియా చేసిన హడావుడి.. ఇలా దేశంలో కొత్త వేరియంట్ ఇప్పటికిప్పుడే పుట్టుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. కొన్ని రోజుల క్రితమే బయటపడిన ఈ వేరియంట్ కేంద్రానికి తెలిసినప్పటికీ కేంద్రం సమీక్షా సమావేశాన్ని ఆ సమయంలో ఎందుకు ఏర్పాటుచేయలేదని వైద్య నిపుణులు కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రానికి ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యమనీ, ఇందు కోసం ఎంత వరకైనా వెళ్తుందని విశ్లేషకులు తెలిపారు.
గతంలో దేశంలో కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలోనూ మోడీ సర్కారు ఎన్నికల సమయంలో ఇలాగే చేసిందనీ, ఫలితంగా దేశంలో కరోనా కేసుల భీకరంగా పెరిగి ప్రాణ నష్టాన్ని కలిగించిన విషయాన్ని ఆరోగ్య, వైద్య నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌లో 2020 జనవరిలో కరోనా మొదటి కేసుల బయటపడిందనీ, ఆ సమయంలో ప్రధాని మోడీ అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా సదరు కార్యక్రమానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి.. కరోనా అంశాన్ని గాలికొదిలేశారని తెలిపారు. ఫలితంగా భారత్‌లో కేసులు పెరిగాయనీ, లాక్డౌన్ విధింపుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంద ని నిపుణులు గుర్తు చేశారు. ఆ తర్వాత సెకండ్ వేవ్‌కు ముందు కూడా బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకే ప్రాధాన్యతనివ్వటం.. అటు తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. మోడీ సర్కారు గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వలేదనేందుకు కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ ఉప వేరియంట్ విషయంలో కేంద్రం వైఖరే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం భయాందోళన లకు కారణమై న ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్.7కు సంబంధించిన రెండు కేసులు ఈ ఏడాది జూన్ 23న, సెప్టెంబర్ 16న కనుగొనబడ్డా యి. అయితే, ఈ రెండూ గుజరాత్‌లోనే బయటపడటం గమనించాల్సి న విషయం. జూన్ 23 తర్వాత కానీ, సెప్టెంబర్ 16 తర్వాత కానీ కేంద్రం నుంచి ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలూ కేంద్రం నుంచి విడుదల కాలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉన్నట్టుండి కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రాలకు సూచనలు చేయడంలో మోడీ సర్కారు నిర్లక్ష్య వైఖరి బయటపడుతున్నదని వైద్య నిపుణులు చెప్పారు.