Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అట్టడుగున అసోం, బీహార్, జార్ఖండ్
- ఏపీకి 23వ ర్యాంక్, తెలంగాణకు 26వ ర్యాంక్
- ర్యాంక్‌లు విడుదల చేసిన ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి
న్యూఢిల్లీ : సామాజిక ప్రగతి సూచి (ఎస్పీఐ)లో తమిళనాడు, కేరళ అగ్రగామిగా నిలిచాయి. అసోం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 23వ ర్యాంక్, తెలంగాణ 26వ ర్యాంక్‌లో ఉన్నాయి. దేశంలోని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ (ఎస్పీఐ) నివేదికను ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుదల చేసింది. ప్రాథమిక మానవ అవసరాలు, ప్రజా శ్రేయస్సు పునాదులు, అవకాశాలు వంటి మూడు కీలక కోణాల్లో సామాజిక పురోగతికి సంబంధించిన 12 విభాగాల ఆధారంగా రాష్ట్రాలు, జిల్లాలను సూచిక అంచనా వేసింది. ఈ సూచిక రాష్ట్ర స్థాయిలో 89, జిల్లా స్థాయిలో 49 అంశాలతో కూడిన విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించింది. ప్రాథమిక మానవ అవసరాల్లో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణ, తాగు నీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత భద్రత, ఆశ్రయం వంటి అంశాల్లో రాష్ట్రాలు, జిల్లాల పనితీరును అంచనా వేసింది. ప్రజా శ్రేయస్సు పునాదుల్లో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్సెస్, ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్ అండ్ వెల్నెస్), పర్యావరణ నాణ్యత వంటి అంశాల్లో దేశం పురోగతిని అంచనా వేసింది. అవకాశం విభాగంలో వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక, సమగ్రత, అధునాతన విద్య అందించడం వంటి అంశాలపై దృష్టిపెట్టింది. ఆరు విభాగాలుగా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులను కేటాయించింది.
అత్యధిక సామాజిక పురోగతి
పుదుచ్చేరి (65.99 స్కోర్), లక్షదీప్ (65.89 స్కోర్), గోవా (65.53 స్కోర్), సిక్కిం (65.10 స్కోర్), మిజోరం (64.19 స్కోర్), తమిళనాడు (63.28 స్కోర్), హిమాచల్‌ప్రదేశ్ (63.28 స్కోర్), చండీగఢ్ (62.37 స్కోర్), కేరళ (62.05 స్కోర్)తో అత్యధిక సామాజిక పురోగతి విభాగంలో నిలిచాయి. అయితే ఇందులో పుదుచ్చేరి, లక్షదీప్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాలు కాగా, గోవా, సిక్కిం, మిజోరం, హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రాలు ఉన్నాయి. పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ మాత్రమే అత్యధిక సామాజిక పురోగతి సాధించిన వాటిలో నిలిచాయి.
అధిక సామాజిక పురోగతి
జమ్మూకాశ్మీర్ (60.76 స్కోర్ ), పంజాబ్ (60.23 స్కోర్), దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ (59.81 స్కోర్), లడఖ్ (59.53 స్కోర్), నాగాలాండ్ (59.24 స్కోర్), అండమాన్ నికోబార్ దీవులు (58.76 స్కోర్) అధిక సామాజిక పురోగతి సాధించాయి. ఇందులో పంజాబ్, నాగాలాండ్ మినహాయిస్తే మిగిలినవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలు. అప్పర్ మిడిల్ సోషల్ ప్రోగ్రెస్‌లో ఉత్తరాఖండ్ (58.26 స్కోర్), కర్నాటక (56.77 స్కోర్), అరుణాచల్ ప్రదేశ్ (56.56 స్కోర్), ఢిల్లీ (56.28 స్కోర్), మణిపూర్ (56.27 స్కోర్)తో నిలిచాయి. లోయర్ మిడిల్లో హర్యానా (54.15 స్కోర్), గుజరాత్ (53.81 స్కోర్), ఆంధ్రప్రదేశ్ (53.60 స్కోర్), మేఘాలయ (53.22 స్కోర్), పశ్చిమ బెంగాల్ (53.13 స్కోర్), తెలంగాణ (52.11 స్కోర్), త్రిపుర (51.70 స్కోర్), ఛత్తీస్‌గఢ్ (51.36 స్కోర్), మహారాష్ట్ర (50.86 స్కోర్), రాజస్థాన్ (50.69 స్కోర్) రాష్ట్రాలున్నాయి. ఉత్తర ప్రదేశ్ (49.16 స్కోర్), ఒరిస్సా (48.19 స్కోర్), మధ్యప్రదేశ్ (48.11 స్కోర్) రాష్ట్రాలు తక్కువ సామాజిక పురోగతిని సాధించాయి. అసోం (44.92 స్కోర్), బీహార్ (44.47 స్కోర్), జార్ఖండ్ (43.95 స్కోర్)లు తక్కువ సామాజిక పురోగతిని సాధించాయని ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి తెలిపింది.
తెలంగాణ 26వ ర్యాంక్..
సామాజిక ప్రగతి సూచిక (ఎస్పీఐ)లో తెలంగాణ 26వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్ 23వ ర్యాంక్‌లో నిలిచాయి. తెలంగాణ 52.11 స్కోర్ సాధించింది. తెలంగాణ ప్రాథమిక బేసిక్ అవసరాల్లో (60.53 స్కోర్) సాధించింది. ప్రాథమిక బేసిక్ అవసరాల్లో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణలో (46.62 స్కోర్), త్రాగు నీరులో (70.64 స్కోర్), పారిశుద్ధ్యంలో (82.64 స్కోర్), వ్యక్తిగత భద్రతలో (42.22 స్కోర్) విభాగాల్లో సాధించింది. తెలంగాణ ప్రజా శ్రేయస్సు పునాదుల్లో 45.04 స్కోర్ సాధించింది. ప్రజా శ్రేయస్సు పునాదులో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం (48.79 స్కోర్), ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్సెస్ (41.50 స్కోర్), ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్ అండ్ వెల్నెస్) (44.29 స్కోర్), పర్యావరణ నాణ్యత (45.56 స్కోర్) సాధించింది. తెలంగాణ అవకాశాల్లో 50.75 స్కోర్ సాధించింది. అందులో వ్యక్తిగత హక్కులు (38.25 స్కోర్), వ్యక్తిగత స్వేచ్ఛ, ఎంపిక (62.41 స్కోర్), సమగ్రత (44.06 స్కోర్), అధునాతన విద్య (58.28 స్కోర్) నిలిచింది.