Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాజిటివ్..అని తేలితే.. క్వారంటైన్ : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
- ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలి..
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు విమానాశ్రయాల్లో ర్యాండమ్ పద్ధతిలో, చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థారులాండ్ నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్రం శనివారం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు శనివారం ఉదయం నుంచి ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్ తదితర విమానాశ్రయాల్లో నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా నిర్వహిస్తున్నామని కేంద్రం తెలిపింది. అలాగే కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. మెడికల్ ఆక్సీజన్ నిల్వలు సరిపడా ఉండేట్టు ఏర్పాట్లు చేసుకోవాలని, కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవ్య దేశ ప్రజలను కోరారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, టీకాలు వేయించుకోవాలని తెలిపారు.
కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల్లో రెండు శాతం మందిపై రాండమ్ పద్ధతిలో శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేయాలని తెలిపింది. ఈ నిబంధన శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆరోగ్య కేంద్రాలు కోవిడ్-19 విషయంలో ఏ విధంగా సన్నద్ధంగా ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 27న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య 201కి పెరిగింది. యాక్టీవ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 3397గా ఉంది. కోవిడ్-19 మహమ్మారి మేనేజ్మేంట్ కోసం మెడికల్ ఆక్సిజన్ క్రమబద్ధంగా, నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్యమంత్రి శాఖ శనివారం లేఖలు రాసింది.
విదేశాల నుంచి వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా, కోవిడ్ ఉన్నట్టు తేలితే..వారిని వెంటనే క్వారంటైన్‌కు పంపాలని లేఖలో పేర్కొన్నారు. మనదేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టును కలిగివుండాలని ఆదేశించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వదంతుల్ని నమ్మవద్దని మన్సుఖ్ మాండవ్య ప్రజల్ని కోరారు.