Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండ్లి..పిల్లల తర్వాత చదువు ఆగకూడదని..
- కొట్టాయంలోని మహాత్మాగాంధీ వర్సిటీ నిర్ణయం
న్యూఢిల్లీ : పెండ్లి, పిల్లలు వంటి బంధాలు చుట్టుముట్టడంతో ఎంతోమంది మహిళలు ఉన్నత చదువుల్ని మధ్యలో ఆపేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో వారికి ఉపశమనం కలిగించే విధంగా కేరళలోని కొట్టాయంలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజుల మాతృత్వ సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. సాధారణంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు ఇస్తారు. తల్లి, పిల్లల సంరక్షణ కోసం ఈ సెలవులు ఎంతో ఉపయోగపడతాయి. కాలేజీలో చదివే విద్యార్థినులకు మాతృత్వ సెలవులు ఇవ్వాలని ఒక వర్సిటీ నిర్ణయించటం దేశంలో ఇదే మొదటిసారి. డిగ్రీ, పీజీ విద్యార్థినులకు 60 రోజులపాటు మాతృత్వ సెలవులు ఇవ్వనున్నట్టు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
గర్భం దాల్చిన విద్యార్థినులు ఈ సెలవులను ప్రసవానికి ముందు లేదా తర్వాత తీసుకోవచ్చు. అయితే తొలి లేదా రెండో కాన్పుకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. అంతేగాక కోర్సులో ఒకసారి మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి. ఇక గర్భస్రావం, ట్యూబెక్టమీ కేసుల్లో 14 రోజులు మంజూరు చేయనున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. గర్భధారణ కారణంగా విద్యార్థినుల చదువులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సెమిస్టర్ మధ్యలో మాతృత్వ సెలవులు తీసుకున్న విద్యార్థినులు ఆ తర్వాత పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని తెలిపాయి. దీనివల్ల ఆ విద్యార్థినులు సెమిస్టర్‌ను నష్టపోకుండా ఉంటారని విశ్వవిద్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.