Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలోని జింద్‌లో భారీ కిసాన్ మహాపంచాయత్
- ఎస్కేఎం జాతీయ సమావేశంలో నిర్ణయం
- విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ : జనవరి 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రకటించింది. అదే రోజున హర్యానాలోని జింద్‌లో భారీ కిసాన్ మహా పంచాయత్ నిర్వహిస్తామనీ, అదే రోజు పార్లమెంట్ మార్చ్ తేదీని ప్రకటిస్తామని ఎస్కెేఎం వెల్లడించింది. కర్నాల్‌లోని గురుద్వారా డేరా కర్ సేవాలో ఎస్కేఎం జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్కేఎం నేతలు జోగీందర్ సింగ్ ఉగ్రహన్, విజూ కృష్ణన్, రావుల వెంకయ్య, సునీలం, రంజిత్ రాజు అధ్యక్షత వహించారు. ఏకేఎం నేతలు హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, రాకేష్ టికాయిత్ జోగిందర్ ఉగ్రహన్, యుధ్వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశంలోని అన్ని జిల్లాల్లో ట్రాక్టర్ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.
జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇవ్వనున్నారు. జనవరి 26న హర్యానాలోని జింద్‌లో ఉత్తర భారత రాష్ట్రాల రైతుల భారీ కిసాన్ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. అదే రోజు మార్చి నెలలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్ (కిసాన్ ర్యాలీ) తేదీలను ప్రకటిస్తారు. గతంలో ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయడాన్ని ఎస్కేఎం ఖండించింది. హర్యానా బీజేపీ ప్రభుత్వం రైతులపై తీసుకొచ్చిన గ్రామీణాభివృద్ధి సెస్‌లను ఉపసంహరించుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది. రైతులపై అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, పోలీసుల అణచివేతను ఉపసంహరించుకోవాలని ఎస్‌కెఎం సమావేశం డిమాండ్ చేసింది.
సమావేశ అనంతరం ఎస్కేఎం నేతలు రాకేష్ టికాయిత్, విజూ కృష్ణన్, ఉగ్రహాన్ తదితరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కిసాన్ ఐక్యత బలమైన ప్రదర్శనలో మహా పంచాయత్ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తుందని తెలిపారు.
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్ట్, మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మహాపంచాయత్ ఓ ధృడమైన సందేశాన్ని పంపుతుందని చెప్పారు. లఖింపూర్ ఖేరీ రైతుల హత్యకు పాల్పడిన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలనీ, అజరు మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జైల్లో మగ్గుతున్న రైతులను విడుదల చేయాలని ఎస్‌కెఎం నేతలు డిమాండ్ చేశారు. కిసాన్ ఉద్యమానికి మద్దతిచ్చిన పంజాబ్ గాయకులు కన్వర్ గ్రేవాల్, రంజిత్ బావాలపై కేంద్ర ఏజెన్సీలు, ఐటీ శాఖ దాడులు చేయడాన్ని ఖండించారు. ఎస్కేఎం తదుపరి జాతీయ సమావేశం 2023 ఫిబ్రవరి 9న కురుక్షేత్రలో జరగనుందనీ, అప్పుడు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.