Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న గాంధీ కుటుంబం
- యాత్రలో నటుడు కమల్ హాసన్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. హర్యానా ఫరీదాబాద్‌లోని ఎన్‌హెచ్‌పీసీ మెట్రో స్టేషన్ బదర్పూర్ సరిహద్దు నుంచి భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అనిల్ చౌదరి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బదర్‌పూర్‌లోని ఢిల్లీ సరిహద్దు వద్ద రాహుల్ గాంధీకి, పాద యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర అపోలో ఆస్పత్రి, ఆశ్రమ్ చౌక్ , నిజాముద్దీన్, ఇండియా గేట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, దర్యాగంజ్ మీదుగా ఎర్రకోట వద్ద 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి ప్రియాంక గాంధీ, జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జీవాలా, రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. ఐటీఓ వద్ద యాత్రలో ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హాసన్ కలిశారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశంలో భయాన్ని వ్యాప్తి చేస్తోన్నాయి : రాహుల్ గాంధీ
ఎర్ర కోట వద్ద జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశాన్ని వాస్తవ సమస్యల నుంచి మళ్లించటానికి బీజేపీ ప్రభుత్వం హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ప్రధాని మోడీది కాదని, అంబానీ, అదానీల ప్రభుత్వమని విమర్శించారు. 'కొందరు ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. మేం ప్రేమను పంచుతున్నాం. దేశంలోని సామాన్యులు ఇప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. భారతీయులందరినీ ఆలింగనం చేసుకుంటాం. ప్రతి రాష్ట్రంలో లక్షల మంది యాత్రలో చేరారు. యాత్రలో హిందుస్థాన్, 'మొహబ్బత్' (ప్రేమ) ఉంది. ఇది ఏ కులం, మతం, ధనిక, పేద అని చూడదు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తాం' అని రాహుల్ గాంధీ అన్నారు.
ఓ భారతీయుడిగా పాల్గొన్నాన్ణు కమల్ హాసన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో తాను ఓ భారతీయుడిగా పాల్గొన్నానని ప్రముఖ నటుడు కమల్ హాసన్ చెప్పారు. ఈ యాత్రలో ఎందుకు పాల్గొన్నారని తనను చాలా మంది అడుగుతున్నారన్నారు. తన తండ్రి కాంగ్రెస్‌వాది అని, తనకు రకరకాల భావజాలాలు ఉన్నాయని చెప్పారు. తాను సొంతంగా ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాననీ, అయితే దేశం విషయానికి వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీల రేఖలు మసకబారిపోవాలన్నారు. భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ ప్రభుత్వం భయపడిపోయిందనీ, దానిని ఆపేందుకు కోవిడ్-19ని సాకుగా చూపిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు.