Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుకు రాజ్యాంగమూ అనుకూలమే
- పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- శాసిస్తున్న పెత్తందారీ వర్గం.. నష్టపోతున్న అణగారిన వర్గాలు
- ప్రభుత్వ నియంత్రణ అవసరం : సామాజికవేత్తలు, నిపుణులు
న్యూఢిల్లీ : భారత్‌లో కులచీలికలు తీవ్రమైన తరుణంలో ప్రయివేటు రంగం అనుభవిస్తున్న రాజ్యాంగ నిరోధక శక్తిపై చర్చించాల్సిన అవసరం ఉన్నదని సామాజికవేత్తలు, నిపుణులు అన్నారు. దేశంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ పార్టీలకు ఎన్నికలలో ఎప్పటికీ ఒక ఆయుధంగానే ఉంటున్నదని చెప్పారు. రాజకీయ పార్టీల మాటలు, హామీలు మాత్రం వాటి చేతల్లో మాత్రం కనిపించటం లేదని వారు తెలిపారు. సామాజిక న్యాయం అంటూ ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పక్కనబెట్టేస్తున్నాయన్నారు. తమ చేతుల్లో అధికారం ఉన్నప్పటికీ.. కార్పొరేటు, ప్రయివేటు 'ఉన్నత వర్గాలకు' దాసోహమంటున్నాయని సామాజికవే త్తలు తెలిపారు. దీంతో కార్పొరేటు, ప్రయివేటు ఉన్నత వర్గం ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదుగుతున్నదని వారు అన్నారు. కానీ, దేశంలోని అణగారిన వర్గాల ప్రజలు మాత్రం తక్కువ జీతాలు అందే ఉద్యోగాల్లో పని చేస్తూ తీవ్ర ఆర్థిక అసమానతకు గురవుతున్నాయని సామాజికవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉద్దేశించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను భారత సర్వోన్నత న్యాయస్థానం సమర్ధించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ప్రయివేటు విద్యాసంస్థలు రిజర్వేషన్‌ను అనుసరించే అంశాన్ని దినేశ్ మహేశ్వరి లేవనెత్తారు. అయితే, ఆ సమయంలో మాత్రం ఈ అంశంపై ఎలాంటి చర్చా జరగలేదు. దీంతో ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్ అంశం అనేది అంతగా జనబాహుళ్యం లోకి రాలేకపోయిందని సామాజికవేత్తలు అన్నారు.
నిజానికి ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్‌కు భారత రాజ్యాంగమూ సమ్మతిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) ప్రకారం ప్రయివేటు సంస్థల్లో రిజర్వేషన్‌ను తప్పనిసరి చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ మహేశ్వరి గమనించారు. ''వృత్తిపరమైన విద్య అందించే సంస్థలతో సహా అన్ఎయిడెడ్ ప్రయివేటు సంస్థలు జాతీయ స్రవంతి నుంచి వేరుగా ఉన్నట్టు చూడలేము. ప్రయివేటు సంస్థలలో రిజర్వేషన్లు ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించవు. కాబట్టి, విద్యను అందించే ప్రయివేటు సంస్థలలో రిజర్వేషన్లను ఒక భావనగా తోసిపుచ్చలేము'' అని ఆయన అన్నారు. అయితే, ప్రయివేటులో రిజర్వేషన్ మినహాయింపు అనేది అణగారిన వర్గాల ప్రజలకు ఒక శాపంగా మారిందని నిపుణులు తెలిపారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు, విద్యార్థులకు శాపంగా మారాయని సామాజిక కార్యకర్తలు చెప్పారు ఎస్సీ, ఎస్టీల కోసం రిజర్వు చేయబడిన ఒక లక్షలకు పైగా ఉద్యోగాలు ప్రయివేటీకరణ కారణంగా కోల్పోయాయని తెలిపారు. కాబట్టి ప్రయివేటు రంగంలో కొనసాగుతున్న 'పెత్తందారీ కుల' గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేసే విధంగా 'ప్రయివేటు' రిజర్వేషన్ల విషయంలో చర్చ జరగాలని సామాజిక కార్యకర్తలు సూచించారు. ఈ విషయంలో ప్రజలు, విద్యార్థులు ఆయా రాజకీయ పార్టీలను ప్రశ్నించాలనీ, దాని ద్వారానే దేశంలో సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని తెలిపారు.
దేశంలోని ప్రయివేటు రంగం పెత్తందారీ వర్గాల చేతిలో ఉన్నదనీ, ప్రభుత్వాల అచేతన వైఖరితో అవి రాజ్యాంగాన్నీ శాసిస్తు ఆర్థికంగా ఎదుగుతున్నాయని తెలిపారు. ఉత్పాదక ఉపాధి, ప్రయివేటు రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాలకు సమాజంలోని ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితం అని తేలిందనీ ఆర్థిక వేత్త అశ్విని దేశ్‌పాండే, సామాజిక శాస్త్రవేత్తలు కేథరీన్, న్యూమాన్, సురీందర్ ఎస్. జోధ్కా చేసిన ఒక అధ్యయనం తేల్చింది. భారతీయ స్టాక్ ఎక్స్చేంజీలో జాబితా చేయబడిన టాప్ 1000 కంపెనీల నమూనా ఆధారంగా, 2010 అధ్యయనం ప్రకారం, భారతీయ కార్పొరేటు రంగంలో కుల వైవిధ్యం లేదనీ, 65 శాతం భారతీయ కార్పొరేటు బోర్డు సభ్యులు కేవలం 'ఒక ఉన్నత కుల' సమూహం నుంచి ఉన్నవారేనని వెల్లడికావడం గమనార్హం.
అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 2019లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు తక్కువ జీతం పొందుతున్నాయని తేలింది. వివక్షత, పక్షపాతంతో కూడిన కార్పొరేట్ హెచ్ఆర్ విధానాలు లేకండా ప్రయివేటు రంగం ఉద్యోగాలలో అట్టడుగు వర్గాలకు ఇలాంటి తక్కువ ప్రాతినిధ్యమనేది సాధ్యం కాదని అధ్యయనం సూచిస్తున్నది. అయితే, ఈ విధానం మారి దేశంలోని అణగారిన వర్గాల ప్రజలకు ప్రయివేటు రంగంలోనూ చక్కని అవకాశాలు రావాలంటే ప్రభుత్వాలు నియంత్రణా చర్యలను అమలు చేయాలని నిపుణులు సూచించారు.