Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో పాఠశాలలకు వీహెచ్‌పీ బెదిరింపు
- ఉత్తరాఖండ్‌లోనూ... హిందూ కార్యకర్తల దాడి
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. క్రిస్మస్ సందర్భంగా హిందూ మతానికి చెందిన పిల్లలతో శాంటాక్లాజ్ దుస్తులు వేయించవద్దని, ఇది మతమార్పిడికి ప్రారంభమని రాష్ట్రంలోని పాఠశాలలకు వీహెచ్‌పీ బెదిరింపులు జారీచేసింది. హిందూమతానికి చెందిన పిల్లల తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పిల్లలకు శాంటాక్లాజ్ దుస్తులు వేయరాదని, ఒకవేళ అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ ఏకంగా పత్రికా ప్రకటనే విడుదల చేసింది. భోపాల్ వీహెచ్‌పీ ప్రాంతీయ ప్రచారక్ జితేంద్ర చౌహాన్ శనివారం ఈ ప్రకటన జారీచేశాడు. హిందూ మతానికి చెందిన పిల్లల్ని శాంటాక్లాజ్ దుస్తులు వేసుకోమన్నా, క్రిస్మస్ ట్రీ తీసుకురావాలని చెప్పినా..ఆ స్కూల్ సంగతి తేల్చుతామని లేఖలో బెదిరింపులు జారీచేశాడు. పిల్లల్ని క్రైస్తవం వైపు ఆకర్షించే ప్రయత్నంగా ఆ ప్రకటనలో పేర్కొన్నాడు.
హిందువుల పిల్లలు కేవలం రాముడు, కృష్ణుడు, బుద్ధ, మహావీర్, గురు గోవింద్ సింగ్..మొదలైనవారిని గుర్తుకు తెచ్చే దుస్తులు వేసుకోవాలని, వారు మాత్రమే గొప్పవారని తెలిపాడు. ఈ ప్రకటనను అన్ని పాఠశాలలకు పంపుతున్నామని అందులో పేర్కొన్నాడు. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రుల నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే, వారి వైపు నిలబడి తగిన చర్యలకు దిగుతామని హెచ్చరించాడు. ''శాంటాక్లాజ్ దుస్తులు వేయదలుచుకుంటే, వారి తల్లిదండ్రుల నుండి కచ్చితంగా రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. శాంటా క్లాజ్ వేయటం మతమార్పిడికి ప్రారంభం వంటిది. వారిని మతపరంగా ప్రభావితం చేయటమే. పాఠశాలలు ఈ విధంగా చేస్తే మా వైపు నుంచి చర్యలు ఎదుర్కోవాల్సిందే''నని మీడియాతో మాట్లాడుతూ చౌహాన్ అన్నాడు.
ఉత్తరాఖండ్ లోనూ... హిందూ కార్యకర్తల దాడి
ఉత్తరాఖండ్‌లోని ఓ క్రిస్మస్ కార్యక్రమంపై హిందూ కార్యకర్తలు దాడి చేశారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు 150కిలోమీటర్ల దూరంలో ఉన్న పురోలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన మతమార్పిడి నిరోధక బిల్లు.. శనివారం ఆమోదం పొందింది. దీంతో హిందూ సంస్థకు చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. వివరాల ప్రకారం.. సెమీ క్రిస్మస్ సందర్భంగా 'హౌప్ అండ్ లైఫ్ సెంటర్' లో ప్రార్థనలు నిర్వహించగా... ముస్సోరిలోని యూనియన్ చర్చికి చెందిన పాస్టర్ హాజరయ్యారు. దీంతో అక్కడికి చేరుకున్న సుమారు 30 మంది హిందూ కార్యకర్తలు ప్రార్థనలు నిలిపివేయాల్సిందిగా బెదిరించారు. బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారంటూ వారిపై దాడికి దిగారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పాస్టర్ లాజరస్ కార్నెలియస్, అతని భార్య సుష్మా సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విడుదల చేసినట్టు జిల్లా అధికారి తెలిపారు.