Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో రూ.1.22 లక్షల కోట్లు మాయం
- వెనక్కి తీసుకుంటున్న విదేశీ మదుపర్లు
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని, విదేశీ పెట్టుబడుదారులు దేశంలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్న మాటలకు భిన్నమైన స్థితి ఇది! కొత్తగా పెట్టుబడులు పెట్టే సంగతి అటుంచితే, ఇప్పటికే ఉన్న సంపద కూడా విదేశాలకు ఎగిరిపోతోంది. విదేశీ మదుపర్లు స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఇతర దేశాలకు తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్ నుండి 1.22 లక్షల కోట్ల రూపాయలు (16.58 బిలియన్ డాలర్లు) విదేశాలకు తరలినట్టు అంచనా. ఇంత పెద్ద మొత్తాన్ని ఒకే ఏడాదిలో విదేశీ మదుపర్లు తరలించుకుపోవడం ఇదే మొదటిసారి. దీని ప్రభావం విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పెద్ద ఎత్తున పడుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో విదేశీ నిల్వలు తగ్గిపోయాయి. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పిఐ)ల వైఖరి ఇదే మాదిరి కొనసాగితే స్టాక్ మార్కెట్ మరింతగా కుప్పకూలే అవశాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా భారత స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు చేయడానికి ఆసక్తి చూపిన ఎఫ్‌పిఐలు ఒక్కసారిగా తమ వైఖరి మార్చుకుని, అమ్మకందారులుగా మారారు. నష్టం రాకుండా సాధ్యమైనంత త్వరగా భారత స్టాక్ మార్కెట్‌నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎందుకీ స్థితి...?
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కునే పేరుతో భారత రిజర్వు బ్యాంకుతో పాటు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. అమెరికన్ ఫెడరల్ బ్యాంకు కూడా ఇదే విధంగా వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో భారత స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే అమెరికాలోని డిపాజిట్ల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తోంది. అందువల్ల లాభం వచ్చే అమెరికన్ బ్యాంకులకు డిపాజిట్ల రూపంలో పెట్టుబడి తరలిపోతోంది. దీంతో పాటు రోజురోజుకి క్షీణిస్తున్న రూపాయి విలువ కూడా సంపద తరలిపోవడానికి కారణమవుతోంది. రూపాయి బలంగా ఉంటే విదేశీ మదుపర్లకు వారి పెట్టుబడులపై ఎక్కువ లాభాలొస్తాయి. అదే రూపాయి విలువ తగ్గితే వారి లాభాలు కూడా తగ్గుతాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ తగ్గుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే సమయాన్ని పరిగణలోకి తీసుకుని అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 10.2 శాతం మేర రూపాయి విలువ తగ్గింది. అదే సమయంలో అమెరికన్ బాండ్ల నుండి వచ్చే ఆదాయం 1.5 శాతం నుండి 3.7 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు కూడా మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి కారణంగా భావిస్తున్నారు.
ఎలా తగ్గింది ...?
2020వ సంవత్సరానికి స్టాక్ మార్కెట్లో 1,72,184 కోట్ల రూపాయలను విదేశీ మదుపర్లు పెట్టుబడులుగా పెట్టారు. కరోనా విజృంభణ సమయంలోనూ ఈ మొత్తం కొనసాగింది. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుండి ఈ పరిస్థితి మారింది. విదేశీ మదుపర్లు ఒక్కసారిగా తమ పెట్టుబడులను తరలించడం ప్రారంభించారు. జనవరి నుండి ప్రారంభమైన ఈ వైఖరి డిసెంబర్‌లోనూ కొనసాగింది. ఈ నెల 22వ తేది నాటికి 1,21,905 కోట్ల రూపాయలను తరలించారు.
భారీగా తగ్గుతున్న విదేశీ నిల్వలు
రూపాయి విలువ తగ్గుతున్న ప్రభావం విదేశీ నిల్వలపై భారీగా పడుతోంది. రిజర్వుబ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం వారం రోజుల్లోనే 4,716 కోట్ల రూపాయల మేర (571 మిలియన్ డాలర్లు) తగ్గాయి. డిసెంబర్ మొదటి వారాంతంలో దేశంలో 564.07 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండగా, రెండవ వారానికి 563.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయని రిజర్వు బ్యాంకు పేర్కొంది. రూపాయి విలువ క్షీణించడం కొనసాగుతుండటంతో ఈ వారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో దేశంలో 632. 7 బిలియన్ డాలర్ల మేర విదేశీ నిల్వలు ఉండేవి. అప్పటి నుండి ఇప్పటివరకు 11శాతం మేర రూపాయి విలువ క్షీణించింది.