Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొమ్మారెడ్డి సూర్యమోహన్ సంస్మరణ సభలో వక్తలు
అమరావతి :డాక్టర్ బొమ్మారెడ్డి సూర్యమోహన్ ప్రజల పట్ల నిజమైన నిబద్ధతతో వైద్య వృత్తికి జీవితాంతం అంకితమైనారని పలువురు వక్తలు అన్నారు. 'సూర్యమోహన్ జ్ఞాపకాలను పంచుకుందాం..' పేరిట సంస్మరణ సభను ఆయన కుటుంబసభ్యులు విజయవాడలోని మెట్రోపాలిటన్ హోట ల్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సహచరు లు, అభ్యుదయ వాదులు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రసంగించిన ప్రతి ఒక్కరు వైద్యవృత్తిలో ఆయన అంకితమైన తీరును, పేదలకు చికిత్స అందించడానికి తపన పడిన తీరును వివరించారు. తనదైన ప్రత్యేక శైలిలో జూనియర్లను ఆయన తీర్చి దిద్దిన తీరును, వారిని ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్దిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలతో పాటు వైద్య వృత్తిలో ఎదగాలనుకున్న వారికి కూడా ఆయన ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేవారని చెప్పారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ వృత్తిపట్ల నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న సేవా దృష్టి ఆయనను ఆదర్శమైన వైద్యులుగా నిలిపిందన్నారు. సూర్యమోహన్ తన తండ్రి వి.ఆర్ బొమ్మారెడ్డి నుండి ప్రజల పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో వ్యవహరించే తీరును ఆయన అలవరుచుకున్నారన్నారు. బొమ్మారెడ్డి ఆశయాలతో అదే బాటలో పనిచేశారని తెలిపారు. ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్ మాట్లాడుతూ విఆర్ బొమ్మారెడ్డి ప్రజాశక్తిలో సుదీర్ఘకాలం పనిచేసి ప్రజాశక్తిమంతుడుగా పేరు తెచ్చుకున్నారన్నారు. సూర్యకుమార్ ప్రజలకు నిబద్ధతతో వైద్య సేవలందించారని తెలిపారు. బొమ్మారెడ్డి స్మారకంగా ప్రజాశక్తి అందించే ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు సహాయం అందించారని తెలిపారు. సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేశారని చెప్పారు. వి.ఆర్ బొమ్మారెెడ్డి కడవరకు మార్క్సిజానికి కట్టుబడి ఉన్నారని ఆ సిద్ధాంతపు వెలుగులోనే పేదలకోసం సూర్యమోహన్ జీవితాంతం పనిచేశారని అన్నారు వైద్య రంగంలో సూర్యకు మార్ చేసిన సేవలను ప్రముఖ వైద్యులు సుధాకర్ వివరించారు. వైద్యులు బ్రహ్మనందం, అప్పారావు, కృష్ణమోహన్, ప్రముఖ న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్, రఘు, సూర్యమోహన్ భార్య అరుణ, కుమారులు భాస్కర్, చందు, బంధుమిత్రులు, స్నేహితులు పాల్గొన్నారు.