Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు, మూడో స్థానంల్లో హైదరాబాద్, మేడ్చెల్
- చిట్టచివరిలో రాజన్న సిరిసిల్ల
న్యూఢిల్లీ : సామాజిక ప్రగతి సూచిక (ఎస్పిఐ)లో రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచింది. రెండు, మూడో స్థానంల్లో వరుసగా హైదరాబాద్, మేడ్చెల్, అట్టడుగున రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ర్యాంకులు దక్కాయి. దేశంలోని అన్ని జిల్లాలకు సంబంధించిన సోషల్ ప్రోగ్రస్ ఇండెక్స్ (ఎస్పిఐ) నివేదికను ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలి (ఈఎసి-పిఎం) విడుదల చేసింది. ప్రాథమిక మానవ అవసరాలు, ప్రజా శ్రేయస్సు పునాదులు, అవకాశాలు వంటి మూడు కీలక కోణాలలో సామాజిక పురోగతికి సంబంధించిన 12 విభాగాల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించారు. ఈ సూచిక జిల్లా స్థాయిలో 49 అంశాలతో కూడిన విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్‌ను నిర్వహించింది. ప్రాథమిక మానవ అవసరాలు: అందులో పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణ, త్రాగు నీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత భద్రత, ఆశ్రయం వంటి అంశాల్లో జిల్లాల పనితీరును అంచనా వేసింది. ప్రజా శ్రేయస్సు పునాదిలో ప్రాథమిక విజ్ఞాన సదుపాయం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్సెస్, ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్ అండ్ వెల్నెస్), పర్యావరణ నాణ్యత వంటి అంశాల్లో జిల్లాల పురోగతిని మదింపు చేసింది.
జిల్లాల వారీగా..
దేశంలో 58 జిల్లాలు చాలా అధిక సామాజిక పురోగతి సాధించాయి. ఉత్తరాఖండ్‌లో 9, హిమాచల్‌ప్రదేశ్‌లో 7, మిజోరం, జమ్మూకాశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో ఆరు జిల్లాల చొప్పున, సిక్కిం, పుదుచ్చేరి, నాగాలాండ్, మణిపూర్‌ల్లో మూడు జిల్లాల చొప్పున, తమిళనాడు, కర్ణాటక, గోవా, అండమాన్ నికోబర్ దీవుల్లో రెండు జిల్లాల చొప్పున, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, చండిగఢ్ల్లో ఒక్కొ జిల్లా చొప్పున చాలా అధిక సామాజిక పురోగతి సాధించాయి. ఇందులో ఏపి, తెలంగాణకు చెందిన ఒక్క జిల్లా కూడా లేదు. అయితే 114 అధిక సామాజిక పురోగతి జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రెండేసి జిల్లాలు ఉన్నాయి. అప్పర్ మిడిల్ సోషల్ ప్రోగ్రెస్ సాధించిన 135 జిల్లాల్లో ఏపి, తెలంగాణకు చెందిన ఏడు జిల్లాల చొప్పున ఉన్నాయి. 147 లోయర్ మిడిల్ సోషల్ ప్రోగ్రెస్ జిల్లాల్లో తెలంగాణ 15, ఆంధ్రప్రదేశ్ నాలుగు జిల్లాలు ఉన్నాయి. 171 తక్కువ సామాజిక పురోగతి జిల్లాల్లో ఏపికి చెందిన 1, తెలంగాణకు చెందిన ఏడు జిల్లాలు ఉన్నాయి. దేశంలో 82 జిల్లాలు చాలా తక్కువ సామాజిక పురోగతిలో ఉన్నాయి.